English | Telugu

కరెంట్ బిల్లులు మాఫీ చేసి ఇంటి అద్దె ప్రభుత్వమే చెల్లించాలి! జగ్గారెడ్డి డిమాండ్‌

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 వేల రూపాయ‌ల‌ లోపు అద్దె ఉన్న వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కరోనా కాలంలో ఇంటి కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని జగ్గారెడ్డి కోరారు. ఇంటి పన్నులను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని, వర్షాకాలంలో రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ఆయ‌న పేర్కొన్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ తో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయని, ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1500 కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నా, పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మూడు నెలల పాటు అద్దె మినహాయించినా, తర్వాత కట్టాల్సిందే కదా అని అభిప్రాయపడ్డారు. అందుకే, ఇంటి అద్దెలు క‌రెంట్ బిల్లులు కూడా ప్రభుత్వమే భరించాలని ఆయ‌న సూచించారు.