English | Telugu

తిక్కలోడు తిరణాలకు వెళ్ళిన చందంగా జగన్ పాలన అంటున్న ప్రతిపక్షం

అవగాహనా లేమితో ముఖ్యమంత్రి అధికారులను, యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అమరావతి నుంచి రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు అత్యంత సంక్లిష్టమైన ఈ మూడు అంశాలను ఒకే సారి నెత్తిన వేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ముఖ్యమంత్రి జగన్ కు క్లారిటీ ఉందేమో కానీ సంబంధిత శాఖలకు చెందిన ఏ అధికారికీ ఈ మూడు అంశాలపై స్పష్టత లేదన్నది ప్రతిపక్ష పార్టీల వాదన. అన్ని అంశాలనూ ఒకే సమయంలో అమలు చేయాల్సిన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం తీవ్ర వత్తిడిలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి స్పష్టతా లేకుండా ఆదరాబాదరా నిర్వహిస్తున్నారు. నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయని కారణాన్ని పైకి తీసుకువచ్చి సత్వర నిర్ణయాలు తీసేసుకున్నారు.

అదే విధంగా అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశంపై ఎలాంటి స్పష్టత లేకపోయినా తరలింపు ప్రక్రియను అనధికారికంగా చేసేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల వంతు వచ్చింది. ఈ నెలాఖరులోకా కొత్త బడ్జెట్ కు ఆమోదం తెలుపకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి తిప్పలు తప్పవు. అందుకోసం ఇప్పుడు ఉన్న రెండు సమస్యలకు తోడు మూడో సమస్యను సైతం నెత్తికెత్తుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండా అమరావతి తరలిస్తున్నట్లు, క్లారిటీ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు.

మరీ ముఖ్యంగా మండలి రద్దు కోసం కేంద్రాన్ని ప్రతిపాదన పంపినందున మండలిని పిలవకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే వీలు ఉందేమో చూడాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తొలి రోజు ఉభయ సభలు అంటే శాసన సభ, మండలి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికే మండలి రద్దుకు ప్రతిపాదన పంపినందున మండలిని పిలుస్తారో లేదో అన్న అనిశ్చితి పరిస్తితి ప్రస్తుతం నెలకొని ఉంది. మండలి రద్దు ప్రక్రియకు పార్లమెంటు ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించనందున ఇంకా మండలి ఉందని, అందువల్ల శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేయడం తప్పని సరి అని రాజ్యాంగ నిపుణులు అంటున్నా మండలిని సమావేశపరచకుండా కేవలం అసెంబ్లీనే పిలిచే అవకాశం ఉందా అని ముఖ్యమంత్రి కార్యాలయం రూల్ పుస్తకాలు తిరగేస్తోంది. నిపుణుల సలహాలు అడుగుతోంది. మండలి సమావేశాలు కూడా జరిపితే మార్చి 31 లోపు మండలిలో బడ్జెట్ ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ ఎలాగూ చూస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదు. ఇప్పటి వరకూ చాలా వివాదాస్పద నిర్ణయాలను ఏకపక్షంగా తీసేసుకున్నట్లు బడ్జెట్ సమావేశాల విషయంలో కుదరకపోవచ్చని రాజ్యంగా నిపుణులు అంటున్నారు.