English | Telugu

24 గంటలుగా చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఐటీ సోదాలు...

సుదీర్ఘ కాలం పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన పెండ్యాల శ్రీనివాసరావు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ గాయత్రీ నగర్ లోని కంచుకోట అపార్ట్ మెంట్స్ లో ఉన్న ఆయన ఇంట్లో గత ఇరవై నాలుగు గంటలుగా అధికారులు పలు డాక్యుమెంట్ లను పరిశీలిస్తున్నారు. రాత్రంతా రెండు బృందాలు సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక డాక్యుమెంట్ లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరో బృందం విజయవాడ మాచవరం ప్రాంతంలో కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల వరకూ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాసరావు ఎన్నికల తరువాత సచివాలయం లోని జీఏడీకి బదిలీ అయ్యారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాసరావు మాజీ మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అలాగే లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన రాజేష్ ఇంటిలోనూ ఐటీ సోదాలు జరిగాయి. మరోవైపు తెలుగు దేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ ఐటీ శాఖాధికారులు సోదాలు జరిపారు. కడప ద్వారకా నగర్ లోని ఇంటితో పాటు హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో కూడా సోదాలు జరిగాయి. కడపలో శ్రీనివాసులరెడ్డి ఇంట్లో లభించిన సమాచారంతో కడపలోని మరో సబ్ కాంట్రాక్టరు ఏపీ సుబ్బారెడ్డి ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసుల పహరాలో ఏపీకి సంబంధం లేని అధికారులే ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టులకు సంబంధించి పలు లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.