English | Telugu
ఒక్క ఏడాదిలో ఎంత మార్పు.. విజయసాయిని పక్కన పెట్టేశారా?
Updated : May 30, 2020
ఇటీవల, సీఎం జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళే సమయంలో.. కారెక్కిన విజయసాయిని దించేసి మరీ మంత్రి ఆళ్ళ నానిని ఎక్కించుకుని వెళ్లారు. ఆ వీడియో బయటకు రావడంతో జగన్ విజయసాయిని పక్కన పెడుతున్నారని, మునుపటిలా ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న ప్రచారం మొదలైంది. మరోవైపు, కారు నుంచి దించేయడంతో విజయసాయి నొచ్చుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, విజయసాయి మద్దతు దారులు మాత్రం.. హెలికాప్టర్ లో చోటులేదని, బాధితులను పరామర్శించటానికి వెళుతున్నారు కాబట్టి ఆరోగ్య మంత్రి ఆళ్ళ నానిని తీసుకెళ్ళారని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా పరిణామాలు గమనిస్తే మాత్రం.. విజయసాయికి ప్రాధాన్యత తగ్గిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాల్లో పలువురు కీలక నేతలు కనిపించారు.. కానీ ఎక్కడా విజయసాయి కనిపించలేదు. సరే, ఆ సమావేశాలకు విజయసాయి ఎందుకు వస్తారులే అనుకున్నా.. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ ఉత్సవాల్లో కూడా ఆయన కనిపించకపోవడం పార్టీలో కలకలం రేపుతోంది. విజయసాయి శుక్రవారం సాయంత్రమే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారని కొందరు అంటున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి శనివారానికి సరిగ్గా ఏడాది. అలాంటిది ఆ ముందురోజు విజయసాయి హైదరాబాద్ వెళ్లడం ఏంటి?. పార్టీకి ఎంతో ముఖ్యమైన రోజున ఆయన కనిపించకపోవడం.. పలు అనుమానాలకు దారితీస్తోంది. అదీగాక, విజయసాయి ట్విట్టర్ లో బాగా యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా జగన్ ని ప్రశంసిస్తారు, టీడీపీ నేత చంద్రబాబు పై విరుచుకుపడతారు. ఈరోజు కూడా అలవాటు ప్రకారం విజయసాయి చంద్రబాబుపై విమర్శలు చేశారు కానీ.. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జగన్ నిజంగానే విజయసాయిని దూరం పెడుతున్నారా? అది తెలిసి విజయసాయి కూడా చిన్నగా సైడ్ అవుతున్నారా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? అంతా ఆ జగన్నాధుడికే తెలియాలి.