English | Telugu
లేఖలు, లీకులు బాబు పట్ల విధేయత కోసమేనా ?
Updated : Mar 20, 2020
యనమల నాలుక మడత పడిపోయిందని వ్యాఖ్య
చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడకలలు కనడంలో వింతేమీ లేదంటూ వై ఎస్ ఆర్ సి పి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ్యుడు వి విజయసాయి రెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రమేష్ లాంటి వారు తమ యజమానికి ఇప్పటికీ ఏదో విధంగా సేవ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. లేఖలు, లీకులు అందులో భాగమేనంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలని యనమల గారు డిమాండు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సీబీఐని నిషేధించినోళ్ళు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినోళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం? అనవసర ఖర్చులు తప్ప, అంటూ ఇటు మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడును కూడా విజయసాయి రెడ్డి దులిపేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నుంచి హైదరాబాద్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్నట్టు ప్రకటించటంతో , విజయసాయి రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, తన కుటుంబానికి వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, ఏపీలో భ్రద్రత లేదని, నిత్యం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కేంద్రానికి రాసిన లేఖలో ఆరోపణలు చేయడాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీకి ఇప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని చాలా కొంత మంది విశ్వసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలన్నీ అందులో భాగమేనన్నారు.
ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త రాజకీయ సంక్షోభానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహించటానికి నిర్ణయించుకోవటం ప్రధానకారణంగా కానవస్తోంది.