English | Telugu

టీడీపీలో బాలకృష్ణ పట్టు కోల్పోతున్నారా ?

తన సొంత మ‌నిషి పార్టీ ఫిరాయింపుని ఆపుకోలేని హీరో బాల‌కృష్ణ పార్టీకి వారసుడు ఎలా అవుతాడు? పార్టీని ఏమి ఉద్ధరిస్తాడు? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తాను పదవులు సీట్లు ఇప్పించుకున్న నేతలు ఇప్పుడు ఆయన మాట వినడం లేదా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీలో ఒకప్పుడు తనను నమ్ముకున్న నేతలకు పదవులు సీట్లు ఇప్పించుకున్నారు బాలకృష్ణ. ఈ విషయంలో చంద్రబాబు కూడా బాలయ్యకు అడ్డు చెప్పలేదనే టాక్ ఉంది. అయితే టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత సీన్ మారిపోయింది. బాలకృష్ణ సహకారంతో ఎఫ్‌డీసీ చైర్మన్‌ అయిన సినీ నిర్మాత, టీడీపీ మాజీ నేత అంబికా కృష్ణ బీజేపీలో చేరిపోయారు. తాను పార్టీ మారే విషయాన్ని బాలకృష్ణకు ముందుగానే చెప్పానని ఆయన ఆ తరువాత చెప్పుకొచ్చారు.

తాజాగా బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడిగా చెప్పుకునే కనిగిరి మాజీ ఎమ్మెల్యే బాబూరావు కూడా వైసీపీలో చేరిపోవడం బాలకృష్ణ, అభిమానులు, టీడీపీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. 2014లో బాలయ్య సహకారంతోనే కనిగిరి టీడీపీ టికెట్ తెచ్చుకున్న బాబూరావు... ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019లో చంద్రబాబుకు ఆయనకు కనిగిరి నుంచి కాకుండా మరో స్థానం నుంచి టికెట్ కేటాయించారు. దీంతో చాలాకాలంగా పార్టీ వ్యవహారాలకు బాబూరావు దూరంగా ఉంటున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం కాగానే పార్టీ మారుదామని బాబురావు భావించినా బాలయ్య టీడీపీలోనే ఉండమని కోరడంతో ఇన్నాళ్లు అయిష్టంగానే పార్టీలో కొనసాగారు. తనకు రాజకీయాల కంటే బాలయ్యతో సంబంధాల ముఖ్యమని కదిరి బాబురావు గతంలోనే తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి చేరడానికి ఇదే మంచి సమయమని బాబురావు భావించారు. వైసీపీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపిస్తే భవిష్యత్తు బాగుంటుందని బాబురావు అనుకుంటున్నారు. ఈ మేరకు వైసీపీలో చేరే విషయమై బాలయ్యతో మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. టీడీపీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని, అందుకే వైసీపీలో చేరుతున్నట్లు బాబురావు బాలయ్యకు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య కూడా సరే..మీ ఇష్టం..అని ఒప్పుకున్నట్లు సమాచారం. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాబురావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా బాబురావుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాపు సామాజికవర్గానికి చెందిన కదిరి బాబురావు చేరికతో జిల్లాలో ప్రకాశం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ భావిస్తోంది. మొత్తంగా తనకు అత్యంత సన్నిహితుడైన బాలయ్యకు చెప్పి మరీ బాబురావు వైసీపీలో చేరడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. తన బావమరిది బాలయ్య దగ్గరుండి మరీ బాబురావును వైసీపీలోకి పంపించడం పట్ల చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. బాలయ్య రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడతారని టీడీపీ వర్గాలు భావించాయి. కానీ అలా జరగలేదు. బాబూరావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ నేతల బాలకృష్ణ మాటలు కూడా వినడం లేదనే చర్చ పార్టీలో మొదలైంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడి అధికార వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కీలక నేతలంతా పార్టీని వీడుతుండటంతో చంద్ర‌బాబునాయుడికి దిక్కుతోచ‌ని స్థితి ఏర్ప‌డింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు.

సొంత పార్టీలోనే కాదు ప్ర‌భుత్వంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించడం లేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే పార్టీలను పక్కన పెట్టి ప్రొటోకాల్‌ పాటిస్తారని అయితే లేపాక్షిలో నిర్వహించే ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటో ఎక్కడా కనిపించడం లేద‌ట‌. కేవలం ఆహ్వాన పత్రికలో పేరు తప్ప, సభావేదిక, ఆహ్వాన తోరణాలు, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఫొటో కనిపించడం లేదు.