English | Telugu

సౌత్ చైనా సముద్రంలో భారత్ యుద్ధనౌక

నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించే తత్వం డ్రాగన్ కంట్రీ సొంతం. దశాబ్దాలుగా ఇదే తీరును అవలంభిస్తూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది. గత కొద్దినెలలుగా భారత్ చైనా సరిహద్దుల్లో దాగుడుమూతలు ఆడుతూ యుద్ధానికి సిద్ధం అన్న సంకేతాలను పంపుతోంది. అయితే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఈసారి చైనా ఆటలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. శాంతిని కాంక్షిస్తూ యుద్ధవాతావరణాన్ని చల్లపరిచేందుకు చైనా అధికారులతో భారత్ జరుపుతున్న ద్వైపాక్షిక చర్చలు సరైన ఫలితాలను ఇవ్వడంలేదు. చర్చలు ఫలవంతం కాకుంటే పరిస్థితులు మరోవిధంగా ఉంటాయని ఇప్పటికే భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

చైనాతో యుద్ధం అంటూ వస్తే ఈ సారి గట్టి గుణపాఠమే చెప్పాలన్న లక్ష్యంతో భారత్ సైన్యం ఉంది. ఇందులోభాగంగానే భారతవైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన రాఫెల్ లాంటి యుద్ధవిమానాలను చేర్చుతోంది. మరోవైపు నౌకాదళాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్లుతోంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించాలన్న చైనా ప్రయత్నాలను పసికట్టి డ్రాగన్ కంట్రీ ఎత్తులకు భారత్ పై ఎత్తు వేసింది. దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకను పంపింది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని మలక్కా జలసంధి సమీపంలో ఈ యుద్ధనౌక మోహరించింది. భారత్ కు మద్దతుగా దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కూడా తన యుద్ధనౌకలను మోహరించింది. కొద్దిరోజుల కిందటే ఇక్కడ అమెరికా, భారత్ కలిసి నావికా దళ విన్యాసాలను నిర్వహించాయి.

అయితే దక్షిణ చైనా సముద్రంలో ద్వీపాలను కృత్రిమంగా ఏర్పాటుచేసిన చైనా లిబరేషన్ ఆర్మీ భారత్, అమెరికా యుద్ధనౌకలు రావడాన్ని వ్యతిరేకిస్తోంది.