English | Telugu

గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చిక్కుల్లో పడ్డారు. 220 కోట్ల రుణం రిక‌వ‌రీకి విష‌యంలో మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం వేయ‌డానికి ఇండియ‌న్ బ్యాంక్ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. బ్యాంకుకు భారీ రుణం ఎగవేత వ్యవహారంలో ఆయన ఆస్తుల వేలం వేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు అధికారులు మరోసారి ప్రకటన జారీ చేయడం గంటాను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఏప్రిల్ 16న ఇండియన్ బ్యాంకు ఈ వేలం పద్ధతి లో ఆస్తులను వేలం వేయనుంది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్ లోని గంటాకు చెందిన ఫ్లాట్ ఉంది. వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను బ్యాంకు ఆహ్వానించింది.

గంటా కి చెందిన ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు లో గతంలో నూట నలభై ఒక కోట్ల అరవై ఎనిమిది లక్షల ఏడు వేల అయిదు వందల నలభై ఎనిమిది రూపాయలు (రూ.1416807548.07) లోన్ తీసుకుంది. కానీ రుణం తీర్చకపోవడంతో ఇప్పుడు అసలు వడ్డీ కలిపి రెండు వందల ఇరవై కోట్ల అరవై ఆరు లక్షల తొంభై వేల నాలుగు వందల అరవై ఆరు (రూ.2206690446.70) రూపాయలకు చేరింది.

రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్ వాటిని వేలం వేసి ఆ మొత్తం రాబట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ ప్రత్యూష కంపెనీ లో గంటా తో పాటు ఏడుగురు సభ్యులున్నారు. ప్రత్యూష సంస్థ డైరెక్టర్లు ఆస్తుల వేలానికి కూడా ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధం చేసింది.