English | Telugu

తెలంగాణ మందుకి ఆంధ్రాలో ఫుల్ డిమాండ్!!

ఆంధ్రాలో కొత్తగా పెట్టిన మద్యం పాలసీ వల్ల అక్రమంగా బెల్టు షాపులు నడిపే వారికి వరంగా మారింది. ఆంధ్రాలో 8 గంటలకే వైన్ షాపులు మూసివేయడం.. రేట్లు కూడా ఆకాశానికి అంటుతుండటంతో.. తెలంగాణ బోర్డర్ కి దగ్గర్లో ఉన్న ప్రాంతాల వారు తెలంగాణకు వచ్చి తాగి వెళ్లే పరిస్థితి నెలకొంది. తెలంగాణ మద్యం ఆంధ్రాలో ఫుల్ కిక్కెక్కిస్తోంది. తెలంగాణలో చీప్ గా దొరుకుతున్న లిక్కర్ ని ఆంధ్రాకు అడ్డదారిలో తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో పోలీసులు జరిపిన సోదాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఒక ఇంట్లో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన 20 బాక్సులను.. ఆంధ్రాకి చెందిన 2 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్న నటరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను గద్వాలలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి మహానంది పరిసరాల్లో అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు.

నటరాజ్ గతంలో గాజుల పల్లిలో వైన్ షాపు నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. అతని ఇంట్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపుగా రూ. 2 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు తెలిపారు. నటరాజ్ అనే వ్యక్తి లైసెన్సీగా గతంలో షాపు నిర్వహించాడు. అక్టోబర్ 31వ తేదీన తెలంగాణలో టెండర్స్ కు వెళ్లి అటు నుంచి వచ్చే సమయంలో గద్వాలకు సంబంధించిన ప్రాంతంలో మిగిలిన కొంత స్టాకుని తీసుకొచ్చి గాజులపల్లిలోని తన స్వగృహం లోనే నిల్వ ఉంచాడని చెప్పారు. అలా ఉంచిన స్టాకుని దగ్గర్లో ఉన్న బెల్ట్ షాపులకీ అక్రమంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతోనే తనిఖీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. నటరాజ్ ఇంటి వద్ద నిఘా ఉంచిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అతను అక్రమంగా విక్రయిస్తున్న సమయంలోనే పట్టుకోవడం జరగిందని అధికారులు స్పష్టం చేశారు.