English | Telugu

ఢిల్లీ అల్లర్లు.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిని చంపి మురికి కాలువలో పడేసారు!

ఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 26 ఏళ్ల ఇంటిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మను అల్లరి మూకలు హతమార్చాయి. ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన శర్మ.. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన అంకిత్ శర్మ.. ఓ మురుగు కాలువలో విగతజీవిగా కనిపించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అల్లరిమూక ఆయనపై దాడి చేసి, హతమార్చి, పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసింది. ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, అంకిత్ శర్మ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కారణంగా ఇప్పటికే 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 200 మందికి పైగా గాయపడినట్టు సమాచారం.