English | Telugu

మైలవరంలో మర్డర్స్ మిస్టరీ.. ఉమా ఖాతాలో ఒకటి, వసంత ఖాతాలో రెండు!

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అయితే, ప్రస్తుతం కృష్ణాజిల్లా రాజకీయ నాయకుల విమర్శలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఒకరిపై ఒకరు హత్యారోపణలు చేసుకుంటూ కొత్త చర్చలకు దారి తీస్తున్నారు. 2019 ఎన్నికలలో కృష్ణా జిల్లా మైలవరంలో టీడీపీ తరపున దేవినేని ఉమా, వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ బరిలోకి దిగగా.. వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. ఎన్నికల ముందు నుంచే ఉప్పు-నిప్పులా ఉన్న వీరి మాటల యుద్ధం, ఎన్నికల తరువాత మరింత తీవ్రతరమైంది. ఇక రాజధాని అంశంతో వీరి మాటల యుద్ధం మరోస్థాయికి వెళ్ళిపోయింది. రాజధానిగా అమరావతిని మారిస్తే.. రాజీనామా చేస్తానన్న కృష్ణప్రసాద్.. తరువాత యూటర్న్ తీసుకొని మూడు రాజధానులు జై కొట్టారు. అంతేకాదు, మూడు రాజధానులకు మద్దతుగా.. వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలీని కూడా ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో దేవినేని ఉమా.. వసంత కృష్ణప్రసాద్ మరియు ఆయన తండ్రి పై విమర్శలు గుప్పించారు. ప్రజల్ని అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు వంచించారని.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగలేదు. బినామీ ఆస్తుల కోసం సొంత బంధువు పొదిలి రవిని వసంత నాగేశ్వరరావు పొట్టన పెట్టుకున్నారన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని వసంత ఇంట్లో పని చేస్తున్న బాపట్ల మేరీ ఎలా చనిపోయిందో చెప్పాలని ఉమా డిమాండ్‌ చేశారు. ఉమా వ్యాఖ్యలపై వసంత నాగేశ్వరరావు కూడా అదే స్థాయిలో స్పందించారు. బాపట్ల మేరీ చనిపోయిన రోజు కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్నాడని రుజువు చేస్తే నేను తల తీసుకుంటా లేదంటే నువ్వు తల తీసుకుంటావా అని సవాల్ చేశారు. అంతటితో వదిలి పెట్టలేదు.. వదినను చంపిన దేవినేని ఉమాకు సవాల్ చేయాలంటే సిగ్గుగా ఉందన్నారు. మొత్తానికి ఇప్పుడు.. పొదిలి రవి, బాపట్ల మేరీ, ఉమా వదిన మరణాలు చర్చనీయాంశమయ్యాయి. ముందు ముందు వీరి మాటల యుద్ధం ఇంకే స్థాయికి వెళ్తుందో ఏంటో!.