English | Telugu

హీరో మహేష్ బాబుకి జగనన్న విద్యా దీవెన!!

స్టార్ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో.. ప్రభుత్వాలు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడం, పన్ను రాయితీలు ఇవ్వడం కామన్. అలా కాకుండా వెరైటీగా ఓ స్టార్ హీరోకి ప్రభుత్వ పథకం వర్తింప చేస్తే ఎలా ఉంటుంది?. ఏపీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని హీరో మహేష్ బాబు ఫోటో ఓ ప్రభుత్వ పథక లబ్ధిదారుల్లో ప్రత్యక్షమైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.

అయితే ఈ పథకానికి సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేసిన కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో లక్ష్మీ అనే విద్యార్థిని ఫోటోకు బదులుగా సినీ హీరో మహేష్ బాబు ఫొటో వచ్చింది. మరోచోట కూడా లోకేష్ అనే విద్యార్థి ఫోటో స్థానంలో మహేష్‌బాబు ఫోటో ప్రత్యక్షమైంది. దీంతో షాకైన విద్యార్థులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్డుల జారీలో లోపాలు బయటపడటంతో అధికారులు.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఆరా తీస్తున్నారు.