English | Telugu
నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను.. ఆ అభ్యర్థిని తయారుచేస్తాను: రజనీకాంత్
Updated : Mar 12, 2020
ముఖ్యమంత్రి పదవిపై తనకు ఏనాడూ వ్యామోహం లేదని తలైవర్ రజనీకాంత్ స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పారు. గురువారం చెన్నైలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాను పార్టీ అధ్యక్షుడిగా ఉంటానే కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండనని, ప్రజలకు 'అన్న' లాగా పనిచేసే అభ్యర్థిని తయారుచేస్తాననీ ప్రకటించారు. సీఎం పదవిపై తనకు వ్యామోహం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
తన ప్రసంగంలో ఏకవ్యక్తి పాలనను రజనీకాంత్ గట్టిగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏక వ్యక్తి కేంద్రంగా పనిచేస్తున్నాయనీ, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తే పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉంటున్నాడని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అంతర్గతం ప్రజాస్వామ్యం ఉండటం లేదన్నారు. సీఈఓ తరహాలో ఒక వ్యక్తి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే, ఇంకో వ్యక్తి పార్టీని నడిపించాలని అభిప్రాయపడ్డారు.
రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి విద్యావంతులు, నిజాయితీపరులు రావాలని ఆకాంక్షించారు. తను ప్రారంభించబోయే పార్టీలోకి వచ్చేవారికి విద్యాప్రమాణాలు, వయసు కీలకంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 60 నుంచి 65 శాతం యువతకే అవకాశం ఇస్తామన్నారు. ఎక్కువగా 50 ఏళ్ల లోపు ఉన్నవాళ్లనే పార్టీ అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. తమిళనాడు రాజకీయాల్లో విప్లవం తీసుకురావడంలో తానొక చిన్న భాగమవుతానని ఆయన చెప్పారు. జయలలిత, కరుణానిధి వంటి ఉద్ధండ రాజకీయనేతల మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యం ఏర్పడిందనీ, వాళ్ల స్థానాల్ని పూరించే పెద్ద నాయకులెవరూ ఇప్పుడు లేరనీ రజనీకాంత్ అన్నారు.