English | Telugu

నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా...

పూజల్లేక బూజు పట్టి ఉన్నా కానీ, నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా అన్నాట్ట వెనుకటికో పాడుబడ్డ గుడి లో ఉన్న దేవుడు.!! సరిగ్గా ఇప్పుడు ఏ.బీ. వెంకటేశ్వర రావుది అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎప్పుడైతే పూజలు చేయటం మానేసిందో, తర్వాత ఆయన్ను పట్టించుకున్న నాధుడు లేడంటే అతిశయోక్తి కాదేమో... తానొక పోలీస్ ఆఫీసర్ని అనీ, తనకొక యూనిఫామ్ ఉంటుందనీ, ఇంకా తాను ప్రభుత్వానికే తప్పించి పార్టీ కి లేదా ఒక పార్టీ ప్రయోజనాల కోసం పని చేయకూడదనీ తెలిసి కూడా, ఒళ్ళు హూనం చేసుకుని మరీ తెలుగు దేశానికి, ఆ పార్టీ అధినేత కు 24X 7 సేవలందించిన ఏ.బీ.వెంకటేశ్వర రావు ను ఈ రోజు 'ఏమండీ ఏ.బీ. గారూ ఎలా ఉన్నారు,' అని పలకరించే దిక్కే లేకుండా పోయింది. తూచా తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడిచిన అప్పటి డి.జి. పి . ఆర్. పి. ఠాకూర్ మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయిపోయి, ఎదో సింగిల్ రూమ్ ఉన్న ఆఫీసు లో డి.జి. (స్టాంప్స్, స్టేషనరీ) లాంటి పోస్ట్ వెలగబెడుతున్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు భక్తుడే కానీ, మరీ ఏ.బి. మాదిరి ఒళ్ళంతా వీర తాడులు, చెర్నా కోలా దెబ్బల వాతలు తగిలించుకుంటా అయితే ఉద్యోగం చేయలేదు. వ్యవహార జ్ఞానం ఉన్నవాడు కావటం చేత కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయటం తో వై ఎస్ ఆర్ సి పి అధినేత దృష్టి లో అంతగా చెడ్డ కాకుండా, ఎదో 'అహ నా పెళ్ళంట' సినిమా లో బ్రహ్మానందం రోల్ లాంటి ఒక పోస్టు లో ఇమిడిపోయి, కాలం వెళ్ళాం దీస్తున్నారు. ఎటొచ్చీ రెంటికీ చెడ్డ రేవడి లా మిగిలిపోయింది ఏ.బీ. వెంకటేశ్వర రావు గారే. ఇంట లావు కేసులు పెట్టి అధికార వై ఎస్ ఆర్ సి ఫై ఆయన్ను ఇబ్బంది పెడుతుంటే, కనీసం పరామర్శ కు కూడా రాని తన మాజీ బాస్ నాయుడి గారి వైఖరిపై ఏ.బీ. గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిజానికి ఏ.బీ కూడా తన మానాన తాను తెలంగాణాలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే, ఈ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం లాంటి కేసులు పెట్టడం, దానికి తోడు లంక రాజ్యం లో విభీషణుడిలా -విజయవాడ ఎం.పి కేశినేని నాని తన-శత్రు శిబిరం లో వాడి మాదిరి వ్యవహరించటం ఏ.బి. ని కలవరపెడుతున్న అంశాలు. విదేశాలకు నిఘా రహస్యాలను చేరవేయడం, నిఘా పరికరాల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టకాలం దాపురించినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో ఏబీని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖతో పాటు క్యాట్ కూడా సమర్ధించడంతో ఇక ఏబీకి దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న ఏబీపై ఛార్జిషీట్ కూడా దాఖలైతే ఆయన కెరీర్ ఇక ముగినట్లేనని చెప్పవచ్చు.

2014లో టీడీపీ అధికారం చేపట్టాక అదనపు డీజీ హోదాలో విజయవాడ పోలీసు కమిషనర్ గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. కృష్ణాజిల్లాకే చెందిన ఏబీని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏరికోరి ఆ పోస్టులో నియమించింది. దీంతో విజయవాడ నగరంలో టీడీపీ నేతలతో ఆయన సాన్నిహిత్యం పెరిగింది. అప్పుడే అమరావతి రాజధాని కావడం, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేయడం, ఇదంతా ఇంటిలిజెన్స్ వైఫల్యంగా పరిగణించి అప్పటి ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న అనురాధపై చంద్రబాబు వేటు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా అనతికాలంలోనే బాధ్యతలు చేపట్టారు.

ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఛీఫ్ అయ్యాక అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఆయన ఇచ్చే నివేదికపై ఆధారపడటం మొదలుపెట్టింది. దీంతో నిఘా వ్యవస్ధను మరింత పటిష్ట పరిచే క్రమంలో ఏబీ ఇజ్రాయెల్ కు చెందిన ఓ ప్రైవేటు సంస్ద నుంచి అత్యాధునిక నిఘా పరికరాలను తన కుమారుడికి చెందిన సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించి మరీ తెప్పించారు. కొనుగోలుకు అనుసరించిన ప్రక్రియపై ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు ఏబీ. ఆ తర్వాత సదరు నిఘా పరికరాలతో టీడీపీ మంత్రుల కదలికలపైనా ఏబీ నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఆయన్ను నిఘా ఛీఫ్ గా కొనసాగించారు. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఏబీ పూర్తి నమ్మకస్తుడిగా మారిపోయారు. దీంతో చంద్రబాబు ఆయనకు టీడీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యతల్లో అనధికారికంగా వాడుకున్నారు. ఇందులో అప్పటి నిఘా నివేదికల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేసిన ఏబీ.. పలుచోట్ల అభ్యర్ధుల ఎంపికలో వివాదాలు తలెత్తినా వాటిని చొరవతో పరిష్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర్రంలో మరోసారి టీడీపీ గెలవబోతోందని ఏబీ ఇచ్చిన నివేదికలు చంద్రబాబులో సంతోషం నింపగా... పార్టీ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాష్ట్రంలో టీడీపీ గెలవబోతోందనని చెప్పిన ఏబీ... విజయవాడ ఎంపీ స్ధానంలో మాత్రం పార్టీ అభ్యర్ధి కేశినేని నాని ఓడిపోతున్నట్లు నివేదిక ఇచ్చారు. దీనిపై ఇప్పటికీ నాని ఆగ్రహంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలవబోతోందని ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఏబీ ఇచ్చిన నివేదికలు దారుణంగా విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో చంద్రబాబు దగ్గర ఆయన పలుకుబడి సైతం అంతే వేగంగా ఆవిరైపోయింది. దీంతో చంద్రబాబుకు ఆయన దూరమైపోయారు. అదే సమయంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు సహకరించే క్రమంలో తమను టార్గెట్ చేశారనే నెపంతో వైసీపీ నేతలు ఆయనపై పగబట్టారు. ఇలా కొండవీటి చేంతాడు అంతున్న ఏ.బీ. వీర గాధను వినే వారు లేక, పఠించే వారు లేక ...ఆయన ప్రస్తుతం పూజల్లేకుండా పోయి బూజు పట్టిన దేవుడు చందాన మిగిలిపోయారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి, తెలుగు దేశాధినేత చంద్రబాబు నాయుడు , ఏ.బీ. ని రక్షించేందుకు ముందుకు రారని ఏ.బీ. కి, ఆయన సన్నిహితులకు పూర్తిగా అర్ధమైపోయింది.