English | Telugu
హైకోర్టులో జగన్ సర్కార్‌కు మళ్ళీ ఎదురుదెబ్బ.. జీవో 623 రద్దు
Updated : May 22, 2020
గతంలో పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని, ఎటువంటి రంగులు వేయాలనే దానిపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ 623 జీవోను జారీ చేసింది. ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో పాటు టెర్రా కోట్(ఎర్రమట్టి రంగు) రంగును బార్డర్‌గా వేయాలని జీవోలో పేర్కొంది. పైగా ఈ రంగులు దేనికి సంకేతమో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే మళ్లీ అవే రంగులు వేస్తూ జీవో ఎలా ఇస్తారంటూ.. జీవో 623ను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సోమయాజులు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న హైకోర్టు.. 623జీవోను కొట్టివేస్తూ.. జీవోను ఎందుకిచ్చారో ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.