English | Telugu
అయోధ్యలో నాలుగంచెల భద్రత... యూపీలో అడుగడుగునా పోలీసులు...
Updated : Nov 9, 2019
అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, మత ఘర్షణలు జరగకుండా కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చింది. అంతేకాదు, తీర్పు ఎలాగున్నా ఏమీ మాట్లాడొద్దంటూ మంత్రులకు, బీజేపీ నేతలకు ప్రధాని మోడీ ఆదేశించారు. అలాగే ఇరువర్గాలూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఇక, ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. వివాదాస్పద అయోధ్య స్థలం దగ్గర నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 14వేల మంది పోలీసులను మోహరించారు. అలాగే 4వేల మంది పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఒకవేళ పెద్దఎత్తున అరెస్టులు చేయాల్సి వస్తే... జనాన్ని ఉంచేందుకు స్కూళ్లు, కాలేజీలను తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు.
ఇక, అత్యంత కీలకమైన సోషల్ మీడియా వేదికలను సైతం పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్... ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైనా నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో ఎవరూ కూడా వివాదాస్పద కామెంట్స్, వ్యాఖ్యానాలు చేయొద్దని ఆంక్షలు విధించారు. ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేసినా, వైరల్ చేసినా, లైకులు, షేర్లు చేసినా.... జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక, యూపీ పోలీసులు అలర్ట్ ఉండటం కోసం... అత్యంత వేగంగా స్పందించడం కోసం.... ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ తోపాటు ఒక ప్రత్యేక యాప్ ను వినియోగిస్తున్నారు.