English | Telugu

ఇది ఎవరికీ విజయం కాదు... ఓటమి కాదన్న మోడీ... సీజేఐకి జడ్ ప్లస్ భద్రత... 

అత్యంత సున్నితమైన అయోధ్య తీర్పును వెలువరించనున్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కి భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర్పు నేపథ్యంలో గొగోయ్ కి జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. అలాగే, రాజ్యాంగ ధర్మాసనంలోని మిగతా సభ్యులైన జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ ల భద్రతను కూడా పెంచారు.

ఇక, అయోధ్య కేసులో సుప్రీం ఇవ్వబోయే తీర్పు... ఎవరికీ విజయం కాదు.... అలాగని ఓటమి కాదని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత మరియు సద్భావన, అలాగే గొప్ప సంప్రదాయానికి నాంది కావాలన్నారు. అలాగే, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. సుప్రీం తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం కలిసిమెలిసి నిలబడదామంటూ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

అయోధ్య తీర్పును వెలువరించబోతున్న సీజేఐ రంజన్ గొగోయ్..... యూపీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. భద్రతా ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలను యూపీ సీఎస్ అండ్ డీజీపీని అడిగి తెలుసుకున్నారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్లు సీజేఐకి యూపీ సీఎస్ అండ్ డీజీపీ వివరించారు.