English | Telugu
కొడుకు మరణానంతరం ఐదు పతకాలు అందుకున్న తండ్రి.. ఏఎన్‌యూలో హృదయవిదారక దృశ్యం
Updated : Feb 29, 2020
ప్రకాశం జిల్లాలో రోజువారీ కూలీ పని చేసుకునే తిరుపాల్ కు ఏడుగురు కూతుళ్లు, ఓ కొడుకు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని ఎలాగైనా బాగా చదివించాలన్నతపన. రాత్రీ పగలూ కష్టపడ్డాడు. తండ్రి కష్టం చూడలేక పి.హెచ్.డి వరకూ చదువుకున్న కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో విధి తీసుకెళ్లిపోయింది. ఏకైక కుమారుడి మరణం తట్టుకోలేక మూడునెలలకే ప్రాణాలు తల్లి కూడా చనిపోయింది. తాజాగా పీహెచ్ డీలో అతడు చూపిన ప్రతిభకు యూనివర్శిటీ ప్రకటించిన ఐదు గోల్డ్ మెడల్స్ ను అందుకునేందుకు వచ్చిన తండ్రి... శుక్రవారం గుంటూరు జిల్లా నాగార్జున వర్శిటీలో కనిపించిన హృదయవిదారక దృశ్యమిది...
ప్రకాశం జిల్లా మార్కాపురం బాపూజీ కాలనీకి చెందిన తిరుపాల్ నిరుపేద. రోజువారీ కూలీనాలీ చేసుకుంటూ రాత్రి కూడా పూలు అమ్మకుంటూ బతికే తిరుపాల్ కు ఏడుగురు కూతుళ్లు, ఓ కొడుకు. కొడుకు పేరు చెన్నకేశవులు. కూతుళ్ల పరిస్ధితి ఎలా ఉన్నా కొడుకు చెన్నకేశవులను మాత్రం ఎలాగైనా కష్టపడి బాగా చదివించాలన్న తపన ఆ కుటుంబానిది. రోజంతా కూలిపని, రాత్రిళ్లు పూలమ్ముకుంటూ సంపాదించిన డబ్బులతో తిరుపాల్ తన కొడుకును చదివించారు. బాగా చదువుకుని అక్కాచెల్లెళ్లను బాగా చూసుకోవాలనేది అతడి తపన. దీంతో మార్కాపురంలోనే డిగ్రీ వరకూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న చెన్నకేశవులు పీజీ కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. నాలుగేళ్లుగా రాజనీతి శాస్త్రం, ప్రజాసంబంధాల విభాగంలో పీజీతో పాటు పీహెచ్డీ కూడా చేస్తున్న చెన్నకేశవులను విధి వెంటాడింది. గతేడాది ఆగస్టులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చెన్నకేశవులు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి.
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి లక్ష్మమ్మ కూడా మూడు నెలల తర్వాత కన్నుమూసింది. దీంతో ఓ వైపు కొడుకును, మరోవైపు భార్యను పోగొట్టుకుని జీవచ్ఛవంగా బతుకుతున్న తిరుపాల్ కు తాజాగా నాగార్జున యూనివర్సిటీ నుంచి ఓ కబురు అందింది. కొడుకు చెన్నకేశవులు యూనివర్శిటీ పరీక్షల్లో ఐదు గోల్డ్ మెడల్స్ సాధించాడని, వాటిని అందుకోవడానికి యూనివర్సిటీకి రావాలనేది దాని సారాంశం. ఈ వార్త వినగానే తిరుపాల్ కుప్పకూలిపోయాడు. చివరికి ఎలాగోలా కుటుంబం సాయంతో శుక్రవారం యూనివర్శిటీకి వెళ్లిన తిరుపాల్ కన్నీటి మధ్యే తన కుమారుడి తరపున ఐదు గోల్డ్ మెడల్స్ ను అందుకున్నాడు. తాత్కాలిక వీసీ రాజశేఖర్ చేతులో మీదుగా తండ్రి తిరుపాల్ వీటిని స్వీకరించాడు..ఈ హృదయవిదారక దృశ్యం యూనివర్శిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కన్నీళ్లు పెట్టించింది.