English | Telugu
పాతకక్షలతోనే తుని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య.. విచారణ నివేదికకు ప్రెస్ కౌన్సిల్ ఆమోదం
Updated : Feb 29, 2020
గతేడాది అక్టోబర్ 15న తూర్పుగోదావరి జిల్లా తుని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందేనని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దారించింది. సత్యనారాయణ దారుణ హత్య కేసును సుమోటాగా విచారణకు స్వీకరించిన ప్రెస్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి గతంలో నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపిన డీజీపీ ఈ హత్యకు పాతకక్షలే కారణమని నివేదిక ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ప్రెస్ కౌన్సిల్ త్రిసభ్య కమిటీతో విచారణ చేయించింది. అందులోనూ ఈ హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందే అని తేలడంతో విచారణను ముగిస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ప్రకటించింది.
2019 అక్టోబర్ 15న పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ రిపోర్టర్ కె.సత్యనారాయణపై ఆగంతకులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ హత్యకు స్ధానికంగా ఉండే మట్టి, మైనింగ్ మాఫియాలే కారణమని హతుడు సత్యనారాయణ సోదరుడు స్ధానిక పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రమేయంతోనే తన భర్త హత్య జరిగిందని సత్యనారాయణ భార్య కుమారి కూడా మరో ఫిర్యాదు చేసింది. సత్యనారాయణ హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. స్ధానికంగా పోలీసులను కలిసి ఫిర్యాదు చేశాక ఈ హత్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశాయి.
ఓవైపు స్ధానిక పోలీసులు దర్యాప్తు దర్యాప్తు జరుపుతుండగానే అక్టోబర్ 29న వంగలపూడి గౌరీ వెంకటరమణ అనే వ్యక్తి ఈ హత్యకు తానే బాధ్యుడినని పేర్కొంటూ స్ధానిక ఎస్. అన్నవరం వీఆర్వో ముందు లొంగిపోయాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా అప్పగించాడు. తన వద్ద రిపోర్టర్ సత్యనారాయణ రెండుసార్లు రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడని, అడిగితే పోలీసులకు చెప్పి రౌడీ షీట్ కూడా తెరిపించాడని రమణ పేర్కొన్నాడు. ఆ తర్వాత పోలీసులు రమణతో పాటు అతనికి సాయం చేసిన మిగిలిన నిందితులను కూడా అ సాయంతో మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. నిందితుల్లో ఒకరైన దొరబాబు ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ మేరకు వ్యక్తిగత కారణాలే సత్యనారాయణ హత్యకు దారి తీశాయని డీజీపీ ప్రెస్ కౌన్సిల్ కు నివేదిక ఇచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రెస్ కౌన్సిల్ ముగ్గురు సభ్యులతో మరో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో సమావేశమై ఏపీకి చెందిన అదికారులను పిలిపించుకుని దర్యాప్తు చేపట్టింది. ఈ కమిటీ కూడా తన నివేదికలో సత్యనారాయణ హత్యకు పాతకక్షలే కారణమని తేల్చింది. దీంతో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా గతంలో విచారణకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.