English | Telugu

ఏపీలో చమురు ధరల పెంపు.. పెట్రోల్ పై 76 పైసలు, డీజిల్ పై రూపాయి పెంపు

ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 76 పైసలు, డీజిల్ పై రూపాయి 7 పైసలు పెంచుతూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రో ధరల పెంపు ఇది రెండోసారి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ పై ఉన్న 31 శాతం పన్ను కొనసాగుతుండగా.. దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ పన్నుతో పాటు వసూలు చేస్తున్న 2 రూపాయలను 2.76 రూపాయలకు ప్రభుత్వం సవరించింది. అలాగే డీజిల్ పై ప్రస్తుతం 22.25 శాతం పన్ను విధిస్తుండగా.. దానికి అదనంగా 2 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీన్ని ప్రస్తుతం మూడు రూపాయల ఏడు పైసలకు పెంచారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు 76.43 రూపాయల వద్ద ఉండగా.. తాజాగా సవరించిన ధరలతో ఇది 76 పైసల మేర పెరగనుంది. అలాగే లీటరు డీజిల్ ధర ప్రస్తుతం 70.63 రూపాయలుగా ఉండగా.. తాజాగా పెరిగిన ధరలతో మరో రూపాయి మేర పెరగనుంది. వాస్తవానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్ధితులతో దేశవ్యాప్తంగా కొన్నిరోజులుగా చమురు ధరలు తగ్గుతుండగా.. ఏపీలో మాత్రం ప్రభుత్వం రాబడి పెంచుకునే క్రమంలో చమురు ధరలను పెంచినట్లు తెలుస్తోంది.