English | Telugu

కరోనా నేపథ్యంలో జంతు వధపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చైనా దేశ ప్రజల ఆహారపు అలవాట్ల వల్లనే ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా తో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పాంగోలిన్, గబ్బిలాల వంటి వాటిని తినడం వల్లనే ఈ వ్యాధి మనుషులకు సోకిందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. తాజాగా బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. బక్రీద్ దృష్ట్యా జంతువుల అక్రమ వధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. బక్రీద్ పర్వదినం నేపథ్యంలో ఎవరైనా జంతువుల అక్రమవధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలంటూ దాఖలైన ఒక పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా నిబంధనల ప్రకారమే జంతువధ జరగాలని స్పష్టం చేసింది.

ఈ పిల్ విచారణ సందర్భంగా జంతుమాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనాలో గబ్బిలాలు వంటి వాటిని తినడం వల్లే కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించింది. దాంతో, మాంసం దుకాణాలను తనిఖీ చేస్తున్నారా అని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తీ వివరాలతో రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.