English | Telugu

నగరి క్యాడర్ కష్టాలు... టిడిపికి తలనొప్పిగా మారిన ముద్దుకృష్ణ కుటుంబ పోరు

గాలి ముద్దు కృష్ణమనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న నేత. ఎమ్మెల్యేగా, మంత్రిగానే.. కాకుండా రాజకీయాల్లో అనేక పదవులు చేపట్టారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి ఓడిపోయిన తర్వాత చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి టిడిపి ఎమ్మెల్సీగా గాలి ముద్దుకృష్ణ గెలిచారు. ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తూ 2018 లో మృతి చెందారు. అప్పటి నుంచి గాలి వారసత్వం పై చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాలి ఇద్దరు కొడుకుల మధ్య వార్ కు తెరతీసింది. గాలి పెద్దకొడుకు భానుప్రకాశ్, చిన్న కొడుకు జగదీష్ ల మధ్య వారసత్వపోరు టీడీపీ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారింది. దీంతో టీడీపీ హైకమాండ్ గాలి ముద్దు కృష్ణమనాయుడు భార్య సరస్వతమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. గాలి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని సరస్వతమ్మతో భర్తీ చేసింది. తాత్కాలికంగా వారసత్వపు పోరుకు బ్రేకులు వేసింది.

కానీ 2019 ఎన్నికల్లో నగరి టిడిపి టికెట్ ను దక్కించుకునేందుకు సోదరులు ఫైట్ కు దిగారు. గాలిభానుప్రకాష్ ఓ వర్గం గా గాలి జగదీష్ ఎమెల్సీ సరస్వతమ్మ మరో వర్గంగా నగరి టీడీపీ క్యాడర్ ను పంచుకున్నారు. ఎన్నికల ముందు గాలిభానుప్రకాష్ ను టిడిపి అభ్యర్థిగా ప్రకటించింది. హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఎమ్మెల్సీ సరస్వతమ్మ , ఆమె రెండో కొడుకు జగదీష్ లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. భాను ఓటమికి కారణమయ్యారని విమర్శలకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత పార్టీకే తాము దూరమన్న సంకేతాలిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. నగరి మీటింగ్ కు సరస్వతమ్మ.. జగదీష్ లు దూరంగా ఉన్నారు. ఇక తల్లి , తమ్ముడు పై మరింత పగ పెంచుకున్న గాలిభానుప్రకాష్ వారిని నియోజకవర్గానికి మరింత దూరం చేసే ఎత్తుగడలు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికీ గాలి కుటుంబంలో వేరు వేరు కుంపట్లు పెట్టడంతో బలమైన పార్టీ క్యాడర్ కాస్తా నగరిలో గాలి కుటుంబం దెబ్బకి ముక్కలుగా విడిపోవడంతో కొంప మనిగిందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. మొత్తానికి కాలమే ముద్దుకృష్ణమ వారసత్వాన్ని నిర్ణయిస్తుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.