English | Telugu
కల్తీలకు కేంద్రంగా గుంటూరు... పురుగుల మందును కూడా వదలని వైనం
Updated : Nov 25, 2019
గుంటూరు జిల్లా నకిలీ వస్తువులకు అడ్డాగా మారింది. పల్నాడు ప్రాంతంలో నకిలీ పురుగు మందుల దందా సాగుతుంది. అమాయక రైతులకు ఈ నకిలీ మందులు అంటగట్టి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పురుగుమందు దుకాణంలోకి వెళ్లి కొనుగోలు చేసిన రైతు.. ఆ మందును పొలంలో పిచికారి చేసేదాక అది నకిలీదని గుర్తించలేకపోతున్నారు. ఇదేంటంటూ రైతులు వ్యాపారులను అడిగితే వాతావరణం, వర్షాలతో పురుగుల మందులు పనిచేయడం లేదని విక్రయదారులు సాధారణంగా చెబుతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు నామ మాత్రంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇలా అధికారుల అండదండలతో నకిలీ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుంది. పత్తిలో రసం పీల్చే పురుగు నివారణ కోసం ఎఫ్ఎంసీ కొరాజిన్ మందు వినియోగిస్తారు. కొందరు ఇదే పేరుతో నకిలీలను తయారు చేసి గురజాల మండలంలో అమ్మకాలు చేపట్టారు. స్థానిక అధికార యంత్రాంగానికి తెలిసినా పట్టించుకోలేదు. దీంతో ఆ కంపెనీకి చెందిన ప్రతి నిధులే రంగంలోకి దిగారు. వాసవి ట్రేడర్స్, మురళీక్రిష్ణ ట్రేడర్స్ లో నకిలీ మందులను పట్టుకున్నారు. ఆ ఘటనతో ఈ నకిలీ మందుల బాగోతం ఒక్క సారిగా వెలుగు చూసింది. ఇప్పటికే పలు గ్రామాల్లో నకిలీ మందులు అమ్మినట్లు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు.
పురుగుమందు పనితనం సరిగ్గా లేదని రైతు సోదరులు తమ దృష్టికి తీసుకురావడంతో ఆ మందును నిజమైన మందా లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన మందా అనేది తేలడానికి పరీక్షలు నిర్వహించారు. కొన్ని బాటిళ్లు చెక్ చేస్తే అవి డూప్లికేట్ అనే విషయం బయటపడింది. ఈ ప్రాంతాల్లో దాదాపుగా మాచర్ల , రెంటచింతల , గురజాల , దాచేపల్లి, కారంపూడి ఈ ప్రాంతాల్లో పురుగు ఉధృతి పండగ ముందుకు పండగ తరవాతకి కొద్దిగా బాగా కనిపిస్తుంది. అయితే ఈ మందు వ్యాపారం దాదాపుగా కోటి నుంచి కోటిన్నర వరకు ఈ ప్రాంతాల్లో జరిగి ఉంటుందని తాము అభిప్రాయపడుతున్నట్లుగా తెలిపారు అధికారులు.