English | Telugu

ఆంత్రాక్స్ దెబ్బ... కర్నూలు జిల్లాలో మృత్యువాత పడుతున్న గొర్రెలు

కర్నూలు జిల్లాను ఆంత్రాక్స్ దడపుట్టిస్తోంది. ఆంత్రాక్స్ పంజాకు గొర్రెలు పిట్టల్లా రాలుతున్నాయి. కొలిమిగుండ్ల మండలం నాయునిపల్లెలో ఆంత్రాక్స్ సోకి 20 గొర్రెలు మృతి చెందినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో గొర్రెల పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఈ వ్యాధి మిగతా జీవులకూ వ్యాపిస్తుందోనని భయపడుతున్నారు. ఇక మాంసప్రియులూ మఠన్ తినాలంటేనే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. మేకలు ,గొర్రెలు, పొట్టేళ్లు గడ్డి మేసేటప్పుడు మూతి ద్వారా ఆంత్రోసిస్ స్పోర్ట్స్ లోపలకి ప్రవేశిస్తుంది. ఆ బాక్టీరియా శక్తిమంతమైన టాక్సీలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఈ వ్యాధి సోకిన జీవాలు శరీరంలో ఉష్ణో గ్రతలు పెరిగి వణుకుతాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో పాటు నాలుక, గొంతు ,మెడ భాగాల్లో వాపు వస్తుంది. ఆంత్రాక్స్ వచ్చిన పశువులు, గొర్రెలు కొన్ని గంటల్లోనే మృత్యు వాత పడతాయి. ఆ తర్వాత పొట్ట ఉబ్బిపోయి కుళ్లిపోతాయి. ఈ వ్యాధి సోకిన మాంసం తిన్న వారికి కూడా ఆంత్రాక్స్ సోకుతుంది.

ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోయిన గొర్రెలు, మేకలను కూడా వ్యాపారులు నగరాల్లో బహిరంగం గానే విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియని చాలా మంది జనాలు ఆ మాంసాన్ని కొంటున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆంత్రాక్స్ వ్యాధికి చికిత్స చాలా కష్టం, నివారణ ఒక్కటే మార్గం ఆంత్రాక్స్ ఎక్కువగా ఇతర జిల్లాల నుంచి మేత కోసం వచ్చే జీవాల నుంచి సంక్రమిస్తుంది. ఆంత్రాక్స్ తో 20 గొర్రెలు చనిపోయాయని పశుసంవర్థక శాఖాధికారులు చెప్తూంటే వందల కొద్ది మృతి చెందాయని గొర్రెల పెంపకం దారులు తెలుపుతున్నారు. గొర్రెలు చనిపోవడం వల్ల ఆర్థికంగా చితికి పోతున్నామని ప్రభుత్వాధికారులు మేలుకొని జీవాలకు టీకాలు వేయించి ఆంత్రాక్స్ బారి నుంచి రక్షించాలని గొర్రెల పెంపకం దారులు కోరుకుంటున్నారు. పదేళ్ల క్రితం ఆళ్లగడ్డ, నంద్యాల, పత్తికొండ, దుగ్గలి ,శిరువెళ్ల, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లోని గొర్రెలు మేకలు ఆంత్రాక్స్ వ్యాధి బారిన పడి మృత్యు వాత పడ్డాయి. దశాబ్దం తర్వాత మళ్లీ ఈ జబ్బు ప్రబలింది, ప్రజలను భయపెడుతోంది.