English | Telugu

సీఎం జగన్ కి బాబు లేఖ.. రాజకీయాలు మాని నిధులు విడుదల చేయండి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఉపాధి హామీ పథకం పనుల నిలిపివేత, పెండింగ్ బిల్లులపై టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి హామీ పనులు, పెండింగ్ బిల్లుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో జీవనోపాధి లేక నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రద్దులు, కూల్చివేతలు, నిలిపివేతలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. రాజకీయాలు మాని వెంటనే ఉపాధిహామీ నిధులు విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పారు. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క‌న్వెర్షన్ విధానంతో 22 శాఖ‌ల్లో నిధుల‌ను మ‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ ప‌థ‌కానికి అనుసంధానించి అన్ని గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్పనకు కృషి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిద‌ని చెప్పుకొచ్చారు. త‌మ హ‌యాంలో దేశానికి ఏపీ ఒక న‌మూనాగా మార‌డంతోపాటు వంద‌కుపైగా అవార్డుల‌ను సాధించిన‌ట్టు చంద్రబాబు లేఖ‌లో పేర్కొన్నారు.