English | Telugu
ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్ టికెట్ 50 వేల రూపాయలు!
Updated : Mar 24, 2020
కరోనా వైరస్ కాదు కానీ...ఎయిర్ లైన్స్ దోపిడీ మాత్రం అప్రతిహతంగా సాగింది. ఏదో ప్రధాని మోడీ పుణ్యం కట్టుకోబట్టి మరో 21 రోజుల పాటు ఎలాంటి ' గాలి ' బాదుడు ఉండదేమో కానీ, ఈ రెండు రోజుల ముందు వరకూ మాత్రం ప్రయివేట్ ఎయిర్ లైన్స్ పాసెంజర్స్ కు ధరల చుక్కల్ని చూపించాయి. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి అత్యవసరంగా హైదరాబాద్ బయల్దేరిన ఎయిర్ పాసెంజర్స్ కు టికెట్ 50 వేల రూపాయల చొప్పున వసూలు చేసి, ఇండిగో ఎయిర్ లైన్స్ కరోనా సంక్షభం నుంచి దండిగా లాభాలు ఆర్జించింది. అలాగే, అదే రోజు బెంగళూరు కు ఢిల్లీ నుంచి టికెట్ ధర 18 వేల రూపాయలు పలికింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా జేబులు ఖాళీ చేసుకుని మరీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు ఓ.ఎస్.డి. లుగా పలువురు మంత్రులు, ఎం.పీ. ల దగ్గర బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆంధ్ర, తెలంగాణా వాసులు. ఈ విషయం పక్కన పెడితే, స్పైస్ జెట్ అయితే మరో అడుగు ముందుకేసింది.
ఈ రోజు అర్ధ రాత్రి నుంచి ( అంటే .. 23 వ తేదీ అర్ధ రాత్రి నుంచి ) డొమెస్టిక్ ఫ్లయిట్స్ ను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, స్పైస్ జెట్ మాత్రం, ఇంకా తన వెబ్ సైట్ లో ...సర్వీసులు నడుస్తూనే ఉన్నాయనీ, అందువల్ల టికెట్ రద్దు చేసుకోదలిస్తే, ఎదో నామమాత్రం డబ్బు వాపసు చేస్తామంటూ జవాబిస్తోంది. ఇహ, నేరుగా కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ రంగం లోకి దిగితే కానీ, ఈ విమానయాన సంస్థల ఓవరాక్షన్ అదుపులోకి వచ్చేట్టు లేదు.