English | Telugu

ఆ ఘటనతో తనకు ఏ సంబంధం లేదన్న డాక్టర్ సుధారాణి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో శిశువు తలను మొండెం నుంచి వేరు చేసిన ఘటన ఇంకా ప్రజలను కలచివేస్తూనే ఉంది. దీనిపై లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మరోవైపు అసలు ఈ ఘటనలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని సీనియర్లు తనను బలి చేశారని ఆరోపిస్తోంది డ్యూటీ డాక్టర్ సుధారాణి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18 న ఒక మహిళ ప్రసవ సమయంలో శిశువు తలను కోశారు డాక్టర్లు. బాధ్యులైన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డ్యూటీ డాక్టర్ సుధారాణిని కూడా విధుల నుంచి తొలగించింది.

సస్పెండైన డ్యూటీ డాక్టర్ సుధారాణి అసలు ఈ ఘటనతో తనకు సంబంధమే లేదని అంటుంటారు. ఆ రోజు గర్భిణీ మహిళా స్వాతి ప్రసవం కోసం వచ్చిన విషయం కూడా తనకు తెలియదని డ్యూటీలో ఉన్న డాక్టర్ తారాసింగ్ మరో డాక్టర్ సిరాజ్ లు ప్రసవం చేశారని చెప్పారు. వారిద్దరి నిర్వాకం వల్లే శిశువు తల తెగిపోయిందని తర్వాత వారు పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని తన ప్రమేయం లేకుండానే డాక్టర్ సిరాజ్ రెఫర్ లెటర్ రాసి హుటాహుటిన హైదరాబాద్ కు తరలించాడని అంటున్నారు. సీనియర్లు కావాలనే తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా విధుల నుంచి తొలగింపుకు కారణమైన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ తారాసింగ్ డాక్టర్ సిరాజ్ లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు.