English | Telugu

పుట్టినరోజు నాడే కరోనాతో కన్నుమూసిన ఎమ్మెల్యే!!

తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 35 వేలకు పైగా కేసులు, 300 మందికిపైగా మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి తమిళనాడులో ఓ డీఎంకే ఎమ్మెల్యేను కూడా బలితీసుకుంది. కరోనా కారణంగా చేప్పాక్కం ఎమ్మెల్యే అంబజగన్ (62) ప్రాణాలు కోల్పోయారు. కరోనా‌ సోకిన అంబజగన్.. చెన్నైలోని ఓ ఆసుపత్రి‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. భారత్ లో కరోనాతో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, నేడు ఆయన పుట్టిన రోజు కూడా. పుట్టిన రోజు నాడే కరోనా మహమ్మారి ఆయనను బలి తీసుకుంది.

కాగా, దివంగత కరుణానిధి, డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడైన అంబజగన్.. 2001, 2011, 2016 లలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినీ పరిశ్రమతోనూ ఆయనకు అనుబంధముంది. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. నటుడు జయం రవితో ‘ఆదిభగవాన్’ అనే సినిమా నిర్మించారు. అంబజగన్ మృతికి ముఖ్యమంత్రి పళనిస్వామి, స్టాలిన్‌తోపాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.