English | Telugu

మాతృభాషకు సెల్యూట్.. తమిళ పోలీసులంతా తమిళంలోనే సంతకం చేయాలి

ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చే ఎన్నో దేశాలను చూస్తున్నాము. ఇతర దేశాల సంగతి పక్కకి పెడితే మన దక్షిణ భారతంలో మాతృభాషను తల్లితో సమానంగా.. ఎంతో ప్రేమిస్తారు. అలా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అక్కడ పోలీసు శాఖలో తమిళం తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆఫీస్ రికార్డులను తమిళంలో మెయింటేన్ చేయడమే కాకుండా.. ప్రతిరోజు హాజరుపట్టికలో సంతకాలు కూడా తమిళంలోనే చేయాలని డీజీపీ ఆదేశించారు.

తమిళనాట మొత్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు డీజీపీ. స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుండి పోలీస్ కమిషనరేట్లు.. సూపరింటెండెంట్ ఆఫీసులు.. ఇలా ప్రతి రికార్డు తమిళంలోనే ఉండాలన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని సీల్స్ కూడా తమిళంలోనే ఉండాలని చెప్పారు. పోలీసు వాహనాలపై కూడా ఇంగ్లీషలో కాకుండా తమిళంలో కవల్(పోలీస్) అనే పదం కనిపించాలన్నారు.

డీజీపీ కార్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ తమిళనాడు విభాగం సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.పోలీస్ శాఖలో తమిళం తప్పనిసరి చేయడంతో ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతుంది. మాతృభాషకి పెద్దపీట వేసినట్టు అవుతుందని సంతోష పడుతున్నారు. మాతృభాష పరిరక్షణ కోసం మొదటి అడుగు వేస్తూ ఇలా చర్యలు తీసుకోవడం హర్షణీయం అన్నారు. మాతృభాష పట్ల తమిళులకు అమితమైన అభిమానం.. అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలా తమిళం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తమిళ ప్రజలు ఆనందంగా స్వీకరిస్తున్నామని అంటున్నారు.