English | Telugu

దేశ సరిహద్దుల్లో యుద్ధ విమానాలు

నెలాఖరుకు రానున్న రఫేల్ ఫైటర్ జెట్స్..

ఈనెల 22 నుంచి మూడురోజుల పాటు భారత వైమానిక దళం ఉన్నతాధికారుల సమావేశం..

దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులుపై చర్చించేందుకు ఈనెల 22 నుంచి మూడురోజుల పాటు భారత వైమానిక దళం ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, భారత్ చైనా సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, భవిష్యత్ లో తీసుకోవల్సిన చర్యలపై సవివరంగా చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో వైమానిక దళం ఉన్నతాధికారులు చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియాతో పాటు ఏడుగురు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌లు పాల్గొంటారు.

పొరుగుదేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో వారికి గట్టిగా బుద్ధి చెప్పేందుకే వైమానిక దళం సిద్ధమవుతోంది. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్‌–2000, సుఖోయ్‌–30, మిగ్‌–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్‌ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్‌ ఫైటర్లు జెట్లు ఈ నెలాఖరు వరకు ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్‌ జెట్లను లద్ధాఖ్‌ సెక్టార్‌లో సరిహద్దు సమీపంలో మోహరించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వైమానిక దళంలోని అత్యాంత ఆధునిక యుద్ధ విమానాలను ఏయే బేస్ స్టేషన్లలో ఏర్పాటు చేయాలన్న అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. యుద్ధమంటూ వస్తే పొరుగుదేశాలకు గట్టి గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతోనే భారతవైమానిక దళం సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు.