English | Telugu

తాడేపల్లికి చేరిన దగ్గుబాటి - పర్చూరు పంచాయతీ... గొట్టిపాటికి ఇవ్వాలంటూ కార్యకర్తల డిమాండ్

పురంధేశ్వరిని వైసీపీలోకి రప్పించాలని, లేదంటే మీరు దారి మీదేనంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చిచెప్పారని, దాంతో ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వర్రావు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజా పరిణామాలను చూస్తుంటే అది నిజమనించడం లేదు. ఎందుకంటే పర్చూరు నుంచి పెద్దఎత్తున తాడేపల్లికి చేరుకున్న దగ్గుబాటి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను రావి రాంనాథానికి ఇవ్వొద్దంటూ డిమాండ్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ జెండాలను, వైఎస్ బొమ్మలను తగలబెట్టిన ద్రోహి రావి రాంనాథం అంటూ నిప్పులు చెరిగారు. రావి రాంనాథానికి పర్చూరు బాధ్యతలు అప్పగిస్తే నియోజకవర్గంలో వైసీపీ పతనమైనట్టేనని హెచ్చరించారు. రాంనాథానికి కాకుండా... ఇంకెవరికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని కార్యకర్తలు తేల్చిచెప్పారు. దగ్గుబాటినే పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా కొనసాగించాలని లేదంటే గొట్టిపాటి రవికుమార్ కి ఇవ్వాలంటూ విచిత్రమైన డిమాండ్ ను వైసీపీ అధిష్టానం ముందుంచారు.

అయితే, పర్చూరు వివాదాన్ని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి అధిష్టానం అప్పగించింది. దాంతో పర్చూరు నుంచి వందలాదిగా వచ్చిన వైసీపీ శ్రేణులతో... వైవీ అండ్ సజ్జల చర్చలు జరిపారు. పర్చూరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న వైవీ అండ్ సజ్జల.... కార్యకర్తల అభిప్రాయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు పర్చూరు ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, 2014లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి... అప్పుడున్న ఒత్తిళ్లతో తెలుగుదేశంలో చేరి, 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి గెలిచారు. అయితే, ఇప్పటికీ జగన్ తో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. దాంతో గొట్టిపాటి త్వరలోనే వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంకా వైసీపీలో చేరకుండానే, కార్యకర్తలు అప్పుడే పర్చూరు బాధ్యతలు గొట్టిపాటికి ఇవ్వాలని డిమాండ్ చేయడమే ఇంట్రస్టింగ్ గా మారింది.