English | Telugu
నెలరోజుల్లోనే కరోనాకు వ్యాక్సిన్?
Updated : May 3, 2020
కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ ను భారతీయ శాస్త్రవేత్తలు నెల రోజుల్లోనే తయారు చేయడమే కాక మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఇండియాలోనే అత్యున్నతమైన పరిశోధన, అభివృద్ది సంస్థ సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్) ప్రస్తుతం కరోనా వైరస్‌ను నివారించే డ్రగ్ మీద ప్రయోగాలు చేస్తోంది. మరింత విస్తృతమైన ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కోరింది. అన్నీ కుదిరితే నెలరోజుల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ పరిశోధన గురించి అవగాహన ఉన్న సైంటిస్టులు తెలిపినట్టు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. కాడిలా ఫార్మాసిటికల్స్‌కు చెందిన Sepsivac మీద ఈ పరిశోధనలు చేస్తున్నారు. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఒప్పందం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా సీఐఎస్ఆర్ పరిశోధనలు చేస్తోంది. ఇమ్యునోథెరపీ ట్రీట్‌మెంట్‌కు ప్రాథమికంగా డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది.
ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్, భోపాల్ ఎయిమ్స్, మరోచోట 50 మంది పేషెంట్ల మీద పరిశోధించారు. 30 నుంచి 45 రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు త్వరగా వస్తాయని అంచనా వేస్తున్నారు. మూడో దశలో 1100 మంది మీద పరిశోధనలు చేయనున్నారు. అప్పటి వరకు లాక్ డౌన్ గడువును కూడా దశల వారీగా పెంచుకుంటూ పోవాలని శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.