English | Telugu
కరోనా కూడా హెచ్ఐవి లాంటిదే!ప్రపంచ ఆరోగ్య సంస్థ! కరోనా ముప్పు తప్పేది ఎప్పుడు?
Updated : May 14, 2020
అయితే హెచ్ఐవీ లానే కరోనా పోదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్ద బాంబు పేల్చింది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ(AIDS) మాదిరిగానే కరోనా వైరస్ కూడా ఎప్పటికీ పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ జెనీవాలో చెప్పారు. కరోనా వైరస్ సమాజంలో మరో స్థానిక వైరస్ గా మారవచ్చని, ఈ వైరస్ ఎప్పటికీ దూరం కాకపోవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐవీకి ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనలేకపోయారని ఆయన గుర్తుచేశారు. హెచ్ ఐవీ ప్రపంచం నుంచి ఎప్పుడు మాయమవుతుందో ఎవరికీ తెలియదని, అలానే కరోనా వైరస్ కూడా అంతేన్నారు.
అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగితే కరోనాను నివారించగలుగుతామని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఎప్పుడు మాయమవుతుందో తమకు తెలియదని, దీనికి ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగి, దాన్ని ప్రతీ ఒక్కరికీ పంపిణీ చేయగలిగితే ఈ వైరస్ ను అరికట్టవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ వివరించారు. కరోనాకు వ్యాక్సిన్ తయారీ కోసం డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని ర్యాన్ తెలిపారు. ప్రస్తుతానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశ్రుభంగా ఉండటం లాంటి కొన్ని జాగ్రత్తలతో కరోనాను అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందని ర్యాన్ తేల్చి చెప్పారు.
హెచ్‌ఐవి ఎప్పుడూ పోలేదు. కానీ హెచ్‌ఐవి ఉన్నవారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి మార్గాలు కనుగొన్నాము. మనం వాస్తవికంగా ఉండాలి. వ్యాధి ఎప్పుడు మాయమవుతుందో మాకు తెలియదు. మనకు అవసరమైన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేయగల అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను కనుగొనగలిగితే, కరోనాను తొలగించడంలో ఓ అంచనాకు రాగలం"అని ర్యాన్ చెప్పారు. మొదటిసారిగా కొత్త వైరస్ మానవ జనాభాలో ప్రవేశిస్తుంది, అందువల్ల మనం ఎప్పుడు విజయం సాధిస్తామో ఊహించడం చాలా కష్టం అన్నారాయన.
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 98 వేల 77 మంది చనిపోయారు.