English | Telugu
భార్య సహకరిస్తుంటే... భర్త అత్యాచారం చేశాడు... హైదరాబాద్ లో దారుణం
Updated : Feb 7, 2020
హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచమైన మహిళను నమ్మించి మోసం చేశాడు. మంచివాడిగా నటిస్తూ అత్యాచారం చేశాడు. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేటలో నివాసముండే మామిడి సంజీవరెడ్డికి... అమెరికా నుంచి తిరిగొచ్చి కోకాపేటలో నివాసముంటున్న ఓ మహిళతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. 2018 జులైలో సంజీవరెడ్డి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో ఆమె అంగీకరించింది. అప్పట్నుంచి ఇద్దరూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకునే వారు. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే, బాధితురాలు ఒకసారి అమెరికా వెళ్లి తిరిగిరాగా... శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకున్న సంజీవరెడ్డి... ఆమె చెల్లెలు ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఆ తర్వాత హోటల్లో భోజనానికి ఆహ్వానించిన సంజీవరెడ్డి... తన భార్య, మేనల్లుడిని పరిచయం చేశాడు. అయితే, ఆమె భోజనం చేసేందుకు నిరాకరించడంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు.
అనంతరం అపస్మారస్థితిలోకి వెళ్లిన మహిళను నిజాంపేటలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, ఆమె దగ్గరున్న డబ్బు, బంగారు నగలపై కన్నేసిన సంజీవరెడ్డి... తన భార్య, మేనల్లుడి సహకారంతో బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీయించాడు. అప్పట్నుంచి డబ్బు కోసం ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బివ్వకపోతే రేప్ వీడియోను సోషల్ మీడియా పెడతానంటూ 50లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బుతోపాటు 30 తులాల బంగారం, చెక్కులు, 6వేల డాలర్లు బలవంతంగా లాక్కున్నాడు. అయితే, రోజురోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు సంజీవరెడ్డి, అతని భార్య కావేరితోపాటు మేనల్లుడు విశాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
అయితే, సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలపై అటు పోలీసులు ఇటు మీడియా అప్రమత్తం చేస్తున్నా... ఉన్నత చదువులు చదువుకున్న మహిళలు... అమెరికాలో ఉండొచ్చిన వాళ్లు కూడా మోసపోవడం ఆందోళన కలిగిస్తోంది. అపరిచితులనే కాదు తెలిసినవాళ్లను, బంధువులను కూడా నమ్మొద్దంటూ పోలీసులు విస్తృతంగా అవేర్ నెస్ కల్పిస్తున్నా... ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మి అతను చెప్పిన చోటికి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. ఇఫ్పుడైనా, ఇలాంటి దారుణ సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకుని ఎవరికివాళ్లు జాగ్రత్తలు తీసుకోకపోతే... మోసగాళ్ల చేతిలో ఇలా అత్యాచారాలకు, మోసాలకు బలైపోతూనే ఉంటారు. అందుకే, బీ కేర్ ఫుల్ అండ్ టేక్ కేర్ లేడీస్.