English | Telugu
రాముడు పచ్చి తిరుగుబోతు: కత్తి మహేష్
Updated : Feb 7, 2020
కత్తి మహేష్ కొత్త వివాదానికి తెర తీశాడు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు పచ్చి తిరుగుబోతు అనే కామెంట్ చేశాడు. బహుజన సాహిత్య జాతర పేరిట హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని స్త్రీలోలుడు గా అభివర్ణించాడు కత్తి మహేష్. వివాదాల ద్వారా తరచూ హెడ్ లైన్స్ ఎక్కాలనే తత్వం ఉన్న కత్తి మహేష్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి. శ్రీరాముడు తన అంతఃపురం లోని మహిళలతో సరససల్లాపాలు సాగించే వాడని కత్తి మహేష్ చేసిన వెటకారపు వ్యాఖ్యలు నెటిజన్లను కదిలించాయి. సోషల్ మీడియాలో ని దాదాపు అన్ని వేదికలమీద ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. మహేష్ ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే చేశాడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ సిపి అధినేత దృష్టిని ఆకర్షించడానికి ఈ చౌకబారు వ్యవహారానికి దిగాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయమై తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన కత్తి మహేష్, తన కంటే భయంకరమైన హిందువు ఇంకెవరు లేరని, తాను గుడ్డిగా ఫాలో అయ్యే రకాన్ని కానని, తాను దళిత చార్వాకుడు ని అని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. లోగడ పవన్ కళ్యాణ్ మీద కూడా విపరీత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజా వ్యవహారం మాత్రం హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏదో ఒక రకంగా లైమ్ లైట్ లో ఉండటానికి కత్తి మహేష్ చేస్తున్నఈ విపరీత వ్యాఖ్యానాలు పరిగణలోకి తీసుకొని, అతనిపై కేసు నమోదు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనానికి తాజాగా కత్తి మహేష్ వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టు అవుతుందని సోషల్ మీడియా వేదికలు అభిప్రాయపడుతున్నాయి. హిందువులంటే చులకనగా మాట్లాడటం కత్తి మహేష్ లాంటి వారికి ఫ్యాషన్ అయిపోయిందని కూడా హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడిగా నటుడిగా రచయితగా పేరున్న కత్తి మహేష్ ఈ తరహా దిగజారుడు నేలబారు వ్యాఖ్యలు మానుకోవాలని, శ్రీ రాముడి పై చేసిన దురుద్దేశ పూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.