English | Telugu
ఢిల్లీలో ఎన్నికల పోరుకు సిద్ధమైన పార్టీలు, గెలుపెవరిది..?
Updated : Feb 7, 2020
రాజధాని ఢిల్లీలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. డెబ్బై స్థానాలకు ఒకే విడతలో జరగతున్న ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 13,750 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. 380 పోలింగ్ కేంద్రాలను మహిళలు, పదకొండు సెంటర్ లను దివ్యాంగులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 11 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మొత్తం డెబ్బై నియోజక వర్గాలకు గాను ఆరు వందల డెబ్బై రెండు మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కోటి నలభై లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎనభై లక్షల మందికి పైగా పురుషులు, అరవై లక్షల మందికి పైగా మహిళలు ఓటేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. వికలాంగులు వృద్ధుల కోసం స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేశారు. షహీన్ బాగ్, జామియా మిలియా, ఉస్మానియా యూనివర్సిటీ ఇలా పలు ప్రాంతాల్లో సిఎఎ వ్యతిరేక ఆందోళనలతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. తొంబై వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు, నూట తొంభై కంపెనీల కేంద్ర బలగాలు, నలభై రెండు వేల మంది స్థానిక పోలీసులు, పంతొమ్మిది వేల మంది హోమ్ గార్డులతో భద్రతను కట్టు దిట్టం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కంటే ఇప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా బలగాలను మోహరించారు.
ఆమాద్మీ, కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి, జెడియు, లోక్ జన శక్తి పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. మూడు పార్టీలు ఎవరికి వారే విజయంపై ధీమాగా ఉన్నారు. గత అయిదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే నమ్మకంతో ఆప్ ఉంది. ఇక ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి ఈ సారి కూడా ఓటర్లను తమనే ఆదరిస్తారని ఆశతో ఉంది. మరోవైపు ఢిల్లీని వరుసగా మూడు సార్లు ఏలి 2013 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తుంది.