English | Telugu

కరోనా లక్షణాలున్నాయని యువకుడిపై రాళ్లదాడి!

కరోనా వైరస్ మూలంగా ప్రపంచం బెంబేలెత్తుతోంది. కరోనా వల్ల మనుషులంతా సమానమేనని మళ్లీ తెలిసొచ్చిందని, కులం-మతం, పేద-ధనిక అనే తేడా లేకుండా.. అందరూ ఎప్పుడో ఒకసారి ఉత్తి చేతులతో పోవాల్సిందేనని.. కాబట్టి ఉన్నంత కాలం నిస్వార్థంగా బ్రతకాలి అంటూ పెద్దలు నీతి వాక్యాలు చెబుతున్నారు. అయితే ఇలాంటి నీతులు ఎంతమంది చెవికి ఎక్కుతున్నాయో తెలియదు కానీ.. కరోనా ప్రాణభయం మాత్రం చాలామంది మెదళ్ళకు ఎక్కింది. ఎంతలా అంటే ప్రాణభయంతో ఎదుటి వ్యక్తి ప్రాణం తీయడానికి కూడా వెనకాడనంతలా!.

కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన చంద్రకాంత్‌(35) సంగారెడ్డి జిల్లాలో నివసిస్తూ ప్యాసింజర్‌ ఆటో నడుపుతుంటాడు. అతను గురువారం నాడు రామచంద్రాపురం మండలం బండ్లగూడ సమీపంలో దగ్గుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు అతనికి కరోనా వచ్చిందేమోనన్న అనుమానం, తమకెక్కడ ఆ వైరస్‌ అంటుతుందేమోనన్న భయంతో అతనిపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన చూస్తుంటే కరోనా మనుషుల కన్నా ముందు వారిలోని మానవతాన్ని చంపేస్తుందేమో అనిపిస్తుంది. మనుషులకు ప్రాణ భయం ఉండటం సహజమే.. కానీ ఆ భయం ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే అంత కౄరంగా మారకూడదు. దగ్గు, తుమ్ములు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా ఉన్నట్లు కాదు. ఒకవేళ అంతలా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అంతేకాని ఇలా దాడులు చేయకండి.