English | Telugu

అక్టోబర్ నాటికి మూడు కోట్ల వాక్సిన్లతో మనమే ముందుకు...

కోవిడ్ 19 వాక్సిన్ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొన్న హ్యూమన్ ట్రయల్ ప్రారంభించిన వాక్సిన్ను అక్టోబర్ నాటికి కనీసం మూడు కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(sii) అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఈ వాక్సిన్ అన్ని పరీక్షలను దాటుకుని సెప్టెంబర్ నాటికి ప్రజా వినియోగానికి ఆమోదం పొందితే అప్పటికి ఇంగ్లాండ్ లో కేవలం పది లక్షల డోస్ లు మాత్రమే అక్కడ ఆందుబాటులోకి వస్తాయి.ఈ నేపథ్యంలో భారతీయ సంస్థ ఆనాటికి మూడు కోట్ల డోసులతో సిద్ధంగా ఉంటుంది.ఈ విషయంలో ఆక్స్ఫర్డ్ కంటే భారత్ ఒక అడుగు ముందే ఉండాలని నిర్ణయం తీసుకుంది.ఒకసారి వాక్సిన్ ఆమోదం పొందితే కొరత ఉండకూడదనే లక్ష్యంతో అక్టోబర్ నాటికి నెలకు యాభై లక్షల డోస్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు SII CEO అదర్ పూనావాలా చెబుతున్నారు.ఒకసారి మొదలు పెట్టాక ఆ సామర్ధ్యాన్ని నెలకు కోటి డోసుల వరకు పెంచగలమని అంటున్నారు. ఇదిలా ఉండగా లెప్రసీ వాక్సిన్ mycobacterium w ను covid రోగుల చికిత్స కోసం ప్రయోగించి చూసేందుకు PGI చండీఘర్ కు ఆమోదం లభించింది.ఈ వాక్సిన్ను ఇప్పటికే నలుగురు రోగులకు ఇవ్వగా ప్రతికూలతలు లేవని తెలుస్తోంది.ఈ వాక్సిన్ కూడా నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

కాగా బెంగలూరుకు చెందిన BIOCON సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ కిరణ్ మజుందార్ షా తాము ఏడాదిలోపుగానే వాక్సిన్ సిద్ధం చేయగలమని చెప్పారు.ఈలోగా ప్లాస్మా ట్రీట్మెంట్ చక్కని ప్రత్యామ్నాయమని ఆమె చెబుతున్నారు.గత కొద్ది వారాలలో భారత్ కరోనా దుష్పరిణామాలపై మంచి అవగాహన ఏర్పరచుకుందని,అందుకే ఇప్పుడు ఈ మహమ్మారిని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య మాత్రమే కాక వెంటిలేటర్ చికిత్స వరకు వస్తున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.ఈ నేపథ్యంలో మే 3 నాటికి లాక్ డౌన్ సడలిస్తే జూన్ చివరి నాటికి ఆర్థిక పునర్ నిర్మాణంలో మనం గాడిలో పడగలుగుతామని ఆమె అభిప్రాయపడ్డారు.