English | Telugu
స్ధానిక పోరులో గెలుపు కోసం సొంత ఎమ్మెల్యేల ప్రాణాలతో జగన్ చెలగాటం?
Updated : Apr 26, 2020
ఇప్పటికే జనంలో తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల కారణంగా కర్నూలు, శ్రీకాళహస్తి, గుంటూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు వీరి ప్రచార యావ కరోనాను మరింత వ్యాప్తి చేసేలా ఉందన్న విమర్శలు పెరుగుతున్నాయి.
కరోనాతో స్ధానిక ఎన్నికలు వాయిదా పడకముందే జగన్ తన ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పష్టమైన టార్గెట్ ఇచ్చేశారు. స్ధానిక ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని, మంత్రులైతే తమ పదవులు రాజీనామా చేయక తప్పదని జగన్ తేల్చిచెప్పారు. దీంతో ఎలాగైనా స్ధానిక పోరులో ముందుండాలన్న తపనతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులకు బెదిరిపోయి టీడీపీతో పాటు విపక్షానికి చెందిన ఏ ఒక్క అభ్యర్దీ నామినేషన్లు వేసేందుకు సైతం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే వారికి సంఘీభావంగా పల్నాడు వెళుతున్న టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమ కారుపై వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధి భీకరంగా దాడి చేశాడు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న టీడీపీ నేతలను ఆ తర్వాత కూడా బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఆ లోపే కరోనా వైరస్ కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడిపోవడంతో వైసీపీ నేతలు దిక్కుతోచని పరిస్ధితుల్లో పడిపోయారు. కరోనా భయంతో ఓ వారం పాటు ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అయిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత నిత్యావసరాల పంపిణీ పేరుతో జనంలోకి రావడం మొదలుపెట్టారు. శ్రీకాళహస్తిలో మధుసూధన్ రెడ్డి, కర్నూల్లో హఫీజ్ ఖాన్, నగరిలో రోజా, చిలకలూరిపేటలో విడదల రజనీ, విశాఖలో విజయసాయిరెడ్డి, సూళ్లూరుపేటలో సంజీవయ్య ఇప్పటికీ జనాల్లో హల్ చల్ చేస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వీరి కారణంగా స్ధానికంగా కేసులు పెరుగుతుండటంతో కరోనాను కట్టడి చేయలేక అధికార యంత్రాంగం సైతం చేతులెత్తేస్తున్న పరిస్దితులు కనిపిస్తున్నాయి. అయినా స్ధానిక పోరు గెలవాలన్న పట్టుదలతో వీరు ఎవరినీ లెక్క చేయకుండా రోడ్లపైనే ఉంటున్నారు. స్వయంగా జగన్ ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసే క్రమంలో వీరు జనంలో తిరుగుతూ ఉండటంతో అధికారులు కూడా వీరిని అడ్డుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.