English | Telugu

ఆగిన మగ్గం! నేతన్నల ఆక‌లి కేక‌లు! స్థంభించిన కోట్లది రూపాయ‌ల లావాదేవీలు!

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక. ఆ వస్త్రాలు ధరిస్తే రాజసం ఉట్టిపడుతుంది. అయితే లాక్‌డౌన్ నేప‌థ్యంలో వేలాది మంది జీవనోపాధికి భరోసానిచ్చిన చేనేత రంగం ఇప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కక కష్టాలతో కునారిల్లుతోంది. మ‌రోప‌క్క‌ పెరిగిన ముడి సామగ్రి ధరలు, ఇంటిల్లిపాది శ్రమించినా గిట్టుబాటు దక్కక నేతన్నలు కన్నీళ్లుపెడుతున్నారు. ఆకలికేకలు, తెగిపోతున్న పోగుబంధంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల‌ని వారు కోరుతున్నారు.

దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చేనేత మగ్గాలు ఆగిపోయి నేతన్నలు ఆకలితో బాధపడుతున్నారు. కరోనా నేతన్నను పూర్తిగా ముంచేసింది. నేచిన చీరలు అమ్ముడుపోక అవస్థలు ప‌డుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూతపడటం, రవాణా రంగం స్తంభించడంతో చేనేత రంగం నష్టాల బాటపట్టింది. వెంకటగిరి కేంద్రంగా చేనేత వస్త్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. అయితే, ఒక్కసారిగా దుకాణాలు మూతపడటంతో కోట్లది రూపాయ‌ల లావాదేవీలు ఆగిపోయాయి.

రాష్ట్రంలో మాస్టర్స్ బేవర్స్ మరియు చేనేత సంఘాల వ‌ద్ద పేరుకుపోయిన నిల్వ‌ల‌ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి చేనేత రంగాన్ని కాపాడాలి. రంగులను డిపోల ద్వారా అందించి చేనేత కార్మికులకు పని కల్పించాలి. లేనిచో కార్మికుల్లో ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది.