English | Telugu

గాంధీ ఆస్పత్రిలో కలకలం.. హైద‌రాబాద్‌లో క‌రోనా ఆస్పత్రి?

కరోనా వైరస్ వస్తే పేషెంట్‌ని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచాల్సి వుంటుంది. రోగి వ‌ద్ద‌కు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అలాంటి పరిస్థితులు తెలంగాణలోని ఏ ఆసుప‌త్రిలోనూ లేవు.

ప్ర‌స్తుతం మాత్రం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేశారు. ఆ వార్డుల్లోకి కంప్లీట్ సూట్లు వేసుకున్న డాక్టర్లు మాత్రమే వెళ్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాల‌ని అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని పూర్తిగా కరోనా కేసుల కోసం కేటాయిస్తే ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ చెస్ట్ ఆస్పత్రి కుదరకపోతే... మిలిటరీ ఆస్పత్రిని పూర్తిగా తీసుకోవాలని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఆలోచిస్తోంది.

ఇదిలా ఉంటే, కరోనా పేషంట్ జనరల్ పబ్లిక్ వెళ్లే కామన్ బాత్‌రూంకి వెళ్లడం గాంధీ ఆసుపత్రిలో కలకలం రేపింది. తెలంగాణలో ఒక యువకుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనికి గాంధీ ఆస్పత్రిలోని.. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక బాత్ రూం లేకపోవడంతో.. అతను జనరల్ పబ్లిక్ వెళ్లే కామన్ బాత్‌రూంకి వెళ్లాడని తెలుస్తోంది. దీంతో.. ఆస్పత్రి సిబ్బంది, ఇతర రోగులు, వారి కుటుంబ సభ్యులు.. ఎక్కడ తమకి కరోనా సోకుతుందోనని.. ఆందోళన చెందుతున్నారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. తగు జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.