English | Telugu

ఇంటర్నేషనల్ కోర్టుకు అమరావతి ఇష్యూ... త్వరలో యూఎన్ వోకి ఫిర్యాదు...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం అలుపెరగని పోరాటం జరుగుతోంది. రాజధాని గ్రామాల్లో రెండున్నర నెలలుగా రైతులు, మహిళలు, ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు ఎన్నారైలు కూడా వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ రూపాల్లో తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇక, అమరావతిని తరలించొద్దంటూ ఏపీ హైకోర్టులో ఇఫ్పటికే పలు కేసులు నమోదు కాగా, ఇక, ఇప్పుడు అమరావవతి ఇష్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వ తీరును ఎండగడుతోన్న ఎన్నారైలు... ఏకంగా ది హేగ్ లోని ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించారు.

అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ... అమెరికా ఎన్నారైల తరపున శ్రీనివాస్ కావేటి... ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించేవిధంగా ఆదేశాలిచ్చి, అమరావతి రైతులకు న్యాయం చేయాలని తన పిటిషన్ లో కోరాడు. అయితే, అసలు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందో లేదోనన్న అనుమానాలు కలిగినా, అమరావతిపై ఎన్నారై వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. త్వరలోనే సీరియల్ నెంబర్ కేటాయించనున్న ఇంటర్నేషనల్ కోర్టు.... విచారణ చేపట్టనుంది.

అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నారైలు... మొదట్నుంచీ రాజధాని రైతులకు అండగా నిలుస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూనే, ఇఫ్పుడు ఏకంగా ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాదు, అమరావతిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ, త్వరలోనే UNO మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎన్నారైలు తెలిపారు.