English | Telugu

తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్

తెలంగాణలో కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా చోట్ల అన్ని దుకాణాలను తెరుచుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, రాత్రి 7 గంటల వరకే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అయితే, తెలంగాణ బస్సులు వేరే రాష్ట్రానికి వెళ్లబోవని, ఇతర రాష్ట్రాల బస్సులను తెలంగాణకు రానివ్వబోమని చెప్పారు.

హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఉన్నందున సిటీ బస్సులు నడపడం లేదని ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్ కూడా‌ బంద్‌ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయం తీసుకొని హైదరాబాద్‌లోని నిబంధనలు ప్రకటిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లో సరి బేసి విధానంలో సగం దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పారు.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ తెరవడానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. మొత్తం సిబ్బంది విధులకు హాజరు కావచ్చన్నారు. అయితే, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ-కామర్స్‌కు ఆంక్షలు లేకుండా వంద శాతం అనుమతి ఇస్తున్నట్లు సీఎం తెలిపారు.

ప్రతీ ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని.. లేకుంటే, రూ.1000 జరిమానా తప్పదని సీఎం హెచ్చరించారు. భౌతికదూరం కూడా తప్పనిసరి పాటించాలన్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించిందని అవసరం ఉన్న వారు లేనివారు రోడ్ల మీదకు రావొద్దని.. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడం ఉత్తమమని సీఎం చెప్పారు. కరోనా మళ్లీ తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.