English | Telugu

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో టెస్ట్‌లకు అనుమ‌తించం! మ‌ద్యం షాపులు తెర‌వం!

ఏకంగా ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘమైన కేబినెట్ సమావేశంలో తాము తీసుకున్న లాక్‌డౌన్ పొడిగింపు తీర్మానాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపుతున్నట్టు కేసీఆర్ చెప్పారు.

ఈ నెల 30వ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తాం. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో టెస్ట్‌లకు అనుమ‌తించం! మ‌ద్యం షాపులు తెర‌వమ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. నిత్యావ‌స‌ర‌వ‌స్తువుల్లో క‌ల్తీ చేసే వారిపై, ధ‌ర‌లు పెంచిన వారిపై పి.డి. యాక్ట్ కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి మ‌రోసారి హెచ్చ‌రించారు.

ఏప్రిల్ 15వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా పంటలకు నీరు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇక మోదీకి పంపుతున్న తీర్మానంలో లాక్ డౌన్ పొడిగింపు అంశంతో పాటు రైతులకు మేలు జరిగేలా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తాము మోదీకి పంపిన డిమాండ్లలో కోరామని కేసీఆర్ చెప్పారు.

రైతులు పొలం పనులకు అయ్యే కూలీ ఖర్చులో 50 శాతం భరిస్తే.. మరో 50 శాతం నరేగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగా ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న రైతు కూలీలు, రైతులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ అవుతుంది. ఈ కరువు టైంలో ఇది మంచి ప్రయోజనం చేకూర్చినట్లువుతుంది. తెలంగాణాలో ఇప్పుడు రైతుల‌దే రాజ్యం. రైతుల‌కు ఏమాత్రం క‌ష్టం లేకుండా చూసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు.

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించం. ఒకే రోజు వెయ్యి టెస్ట్‌లు చేసే సామ‌ర్థ్యం స్త‌తా ప్ర‌భుత్వానికి వుంది. ప్ర‌భుత్వం వ‌ల్ల కాక‌పోతే అప్పుడు ఆలోచించ‌వ‌చ్చు. ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో ప‌రీక్ష‌లు చేసినా ఉచితంగా చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల వాళ్ళు వెన‌క్కి త‌గ్గారని సి.ఎం. ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో టెస్ట్‌లు, చికిత్స చేస్తేనే రోగికి ప్ర‌యోజ‌నంగా వుంటుంద‌ని, ప్రైవేట్ కంటే ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్సే ద్వారా ఎలే మేలు జ‌రుగుతుందో ముఖ్య‌మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.

క‌రోనాను నియంత్రించ‌డంలో భార‌త్ మెరుగ్గా వుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గిందని సీఎం తెలిపారు. ఏప్రిల్ 24కు బాధితులంతా కోలుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తొలిదశలో విదేశాల నుంచి వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు. కొత్త ఉప్పెన వచ్చి పడకపోతే మనం చాలా వరకు ఈ కష్టాల నుంచి బయట పడ్డట్టే అన్నారు. ఎవరూ భయపడొద్దు.. కష్టాలు వచ్చినపుడు తెలంగాణ ప్రజలు గట్టి పట్టుమీద ఉన్నారు.. లాక్ డౌన్ పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించే వారికి శిక్షలు తప్పవని ముఖ్య‌మంత్రి హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తాం.