English | Telugu
మండలిలో అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు: సీఎం జగన్
Updated : Jan 23, 2020
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణబిల్లుకు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. గవర్నమెంటు ప్రైమరీ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం పర్సెంటేజ్ కేవలం 23.67% శాతం మాత్రమే ఉందని సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. మొత్తం మీద 35% కూడా దాటని పరిస్థితి ఉందని అదే ప్రైవేట్ స్కూల్స్ లో 98.5% శాతం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మరెన్ని సంవత్సరాలు పేదవాళ్ల చదువు అలాగే ఉండాలని.. కేవలం పేదలకు ఇంగ్లీష్ చదువులు రాకూడదన్న కుట్రపూరితమైన పరిస్థితులను మార్చాలని.. మన వ్యవస్థను మార్చాలని.. పేదవాడికి భావి ప్రపంచంలో కూడా పోటీ పడే పరిస్థితి తీసుకొని రావాలనే తాను ఎంతగానో కృషి చేయనున్నట్లు జగన్ తెలియజేశారు.
నేటి తరంలో కంప్యూటర్స్ లో కానీ ఎక్కడ చూసినా ఇంగ్లీష్ భాషనే ఎక్కుగా ఉంటుందని.. మంచి జీతాలతో మంచి జీవితాన్ని గడపాలంటే ఇంగ్లీషు భాష మాట్లాడగలిగితేనే సాధ్యపడుతుందని ఆయన అన్నారు. ప్రపంచంతో తాము ముందుకు నడవాలని.. పేదరికంలో ఉన్న వాళ్ళ బ్రతుకులు బాగుపడాలని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు జగన్ స్పష్టం చేశారు. ఇదే బిల్లును కొద్ది నెలల కిందట తీసుకొస్తే.. రైట్ టు ఎడ్యూకేషన్ కాదు రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో ఈ బిల్లును ప్రతిపాదించినట్లు జగన్ పేర్కొన్నారు. పేదవాడికి మంచి జరిగే ఈ బిల్లును ప్రతిపాదిస్తే దానిని కూడా కౌన్సిల్ లో అడ్డుకున్నారని కానీ ఈ బిల్లును ఎవరు ఆపినా ఆగేది లేదని, మధ్యాహ్న భోజన పథకం కింద మంచి మెనూను సిద్ధం చేసి దానికి గోరుముద్దా అని పేరు పెట్టి పేద పిల్లలకు అందించినట్లు స్పష్టం చేశారు.
జూన్ 1వ తేదీనే పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు, నోట్ బుక్కులు, టెక్స్ట్ బుక్కులు, మూడు జతల యూనిఫాంలు, బూట్లు, సాక్సులు, బెల్టులు.. పెట్టి ఒక కిట్టు ఇస్తున్నట్లు తెలిపారు. దాదాపుగా ఒక పిల్లాడి పై రూ.1355 రూపాయల కేటాయింపు చేస్తూ దాదాపుగా 36 లక్షల 10 వేల మంది పిల్లలకు విద్యా కానుక కింద జూన్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు జగన్ తెలియజేశారు. తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకూడదని పిల్లలందరికి మామగా తాను ఈ కానుకను ఇవ్వనున్నట్లు జగన్ వెల్లడించారు. ఈ బిల్లు ఇక్కడ ఆమోదం తెలిపితే ఆపడానికి ఇంకేమి ఉండదని జగన్ తెలిపారు.