English | Telugu

ఇసుక కొరత ఉందని ఒప్పుకున్న జగన్... పళ్లున్న చెట్టుకే రాళ్లంటూ విపక్షాలకు కౌంటర్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఫస్ట్‌ టైమ్‌ ఇసుక కొరతపై స్పందించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇసుక కొరత ఉందన్న నిజాన్ని ఒప్పుకున్నారు. ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని జగన్... ఇటీవల చోటు చేసుకున్న ఆత్మహత్యలు, సెల్ఫీ వీడియోలతో నిజం ఒప్పుకోక తప్పలేదు. రాష్ట్రంలో ఇసుక కొరతపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి... పళ్లున్న చెట్టు మీదే రాళ్లేస్తారంటూ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. వరదల కారణంగా, ఇసుక తవ్వకాలు నిలిచిపోతే, విపక్షాలు మాత్రం రాబందుల మాదిరిగా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు.

టీడీపీ హయాంలో ఇసుకను దోచేశారన్న జగన్మోహన్ రెడ్డి.... ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపడంతోనే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు విపక్ష నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని జగన్‌ ఫైరయ్యారు. టీడీపీ హయాంలో అవినీతిమయంగా మారిన వ్యవస్థను పూర్తిగా రిపేర్ చేస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి....ఇసుక తవ్వకాల్లో అవినీతిని అరికట్టగలిగామని గర్వంగా చెప్పగలనంటూ వ్యాఖ్యానించారు. అయితే, విస్తారంగా కురిసిన వర్షాలతో నదులు, కాలువన్నీ ఇప్పటికీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో... ఇసుకను ఆశించిన స్థాయిలో తీయలేని పరిస్థితి నెలకొందని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో 267 ఇసుక రీచ్‌లు ఉంటే, వరదల కారణంగా కేవలం 69 చోట్ల మాత్రమే తవ్వకాలు జరపగలుగుతున్నామని, కానీ, ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వంపై విపక్షాలు రాళ్లు వేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎంత బాగా పనిచేస్తున్నా... విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయన్న జగన్‌... భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వ ఆధీనంలో ఇసుక సరఫరా జరుగుతూ పేదలకు న్యాయం జరుగుతుంటే... పని దొరకడం లేదనడంలో అర్ధం లేదన్నారు. పనులు దొరకని కార్మికులు.... ఇసుక రీచ్‌ల్లో పని కల్పించాలని అధికారులను ఆదేశించారు.

మరో వారం రోజుల్లో వరదలు తగ్గుముఖంపట్టి, పరిస్థితి మెరుగవుతుందని, ఇసుక అందుబాటులోకి వస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం దాటి ఇసుక వెళ్లకూడదని కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి... తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా స్వయంగా డీజీపీయే బాధ్యత తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన జగన్.... వారంరోజులపాటు ఇసుక మీదే పనిచేయాలని కలెక్లర్లు, ఇతర ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో కనీసం 70 చోట్ల ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.