English | Telugu

'కళ్లంలోనే కొనుగోళ్లు' మాటలకే పరిమిత‌మా?

'అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి...ఇది ఏపిలో రైతుల దీన‌స్థితి.
లాక్‌డౌన్‌తో ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. వరి, జొన్న, మొక్కజొన్న లాంటి ఆహార పంటలు, మిర్చి, పొగాకు, పసుపు తదితర వాణిజ్య పంటలను కొనే నాథుడే లేడు. ఇక పండ్లు, పూలు, కూరగాయల రైతుల బాధలు వర్ణనాతీతం. చేనులోనే పంట ఎండిపోవడమో లేక రోడ్లపై పారబోయడమో జరుగుతోంది. కష్టకాలంలో సైతం పండినదాంట్లో జొన్న, మొక్కజొన్న కేవలం 25 శాతం, ధాన్యంలో 60 శాతం మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరి కాదు. ఇక కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలన్నా ఇ-క్రాప్‌ బుకింగ్‌, ఇతర షరతులతో మరిన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. అందునా కౌలురైతుల పరిస్థితి దయనీయంగా వుంది.

'కళ్లంలోనే కొనుగోళ్లు' అన్నవి మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణ లోకి రావడంలేదు. ఉత్పత్తిదార్లు తమ పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా చాలా తక్కువకు వ్యాపారులకు, దళారులకు అమ్ముకోవలసి వస్తోంది. వ్యవసాయ కార్మికులకు పనులు లేవు.

పని కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చిన వలస కార్మికుల పరిస్థితి అయితే దారుణ‌మే మ‌రి. అటు ఎస్‌ఇజెడ్‌, భారీ పరిశ్రమలేగాక చిన్న చిన్న పరిశ్రమల్లోనూ పని చేసే కార్మికులు గాని ఇటు భవన నిర్మాణ పనివారంతా ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యవసాయ పనుల కోసమే జిల్లాలు దాటి వచ్చిన వలస జీవులు వేల సంఖ్యలో వున్నారు. వీరందరికీ పని లేదు సరికదా రోజువారీ ఆహారం కూడా కనాకష్టమైపోతోంది.

కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలూ చేపట్టే ఆహార పంపిణీ కార్యక్రమాల కోసం ప్రతి రోజూ ఎదురు చూసే దుస్థితి ఏర్పడింది. దాంతో ఇక్కడ వుండలేక తమ స్వగ్రామాలకు కాలినడకనైనా వెళ్లిపోవాలన్న స్థితికి వారొచ్చారు. ముఖ్యంగా మే3 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించాక ఈ ధోరణి గత రెండు రోజులుగా ఇంకా పెరుగుతోంది.

స్థానికంగానే వుంటూ రోజుకు ఐదారొందల రూపాయ‌ల‌ వరకు సంపాదించే ఆటో, భవన నిర్మాణ, హమాలీల్లాంటి అసంఘటిత కార్మికులకు ఇప్పుడు రూపాయి కూడా ఆదాయం లేదు. వారందరినీ ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతే!