English | Telugu

చెక్ బౌన్స్‌ ఇక క్రిమినల్ కేసు కాదు!!

చెక్ బౌన్స్ మరియు రుణాలు తిరిగి చెల్లించడంలో ఆలస్యం వంటి చిన్న ఆర్థిక ఉల్లంఘనలను క్రిమినల్ కేసులుగా పరిగణించరాదని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు, చిన్న చిన్న ఆర్థిక ఉల్లంఘనలను డీ క్రిమినలైజేషన్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా.. మొత్తం 19 చట్టాల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం, జూన్ 23 వరకూ అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. సాంకేతిక కారణాలతో చేసే చిన్న చిన్న తప్పులను తీవ్ర నేరాల జాబితా నుంచి తప్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన. దీని ద్వారా సులభతర వ్యాపార పరిస్థితులను కల్పించ వచ్చన్నది కేంద్రం అభిమతం. దీనిపై జూన్ 23 లోగా తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పౌర సంఘాలు, విద్యావేత్తలు, తదితరులను కోరింది.

కాగా, ప్రస్తుతం చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ల వరకూ జైలుశిక్ష లేదా చెక్ మొత్తానికి రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ చట్టాలతో పాటు బ్యాంకు రుణాల చెల్లింపు ఉల్లంఘనలు, ఎల్ఐసీ, పీఎఫ్ఆర్డీఏ, చిట్ ఫండ్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ బిజినెస్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం, ఫ్యాక్టరింగ్ నియంత్రణ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నియంత్రణ, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తదితర చట్టాలను సవరించాలని కేంద్రం ప్రతిపాదించింది.