English | Telugu
శానిటైజర్స్, మాస్కులపై పన్నుల రద్దుకు చంద్రబాబు డిమాండ్
Updated : Mar 24, 2020
శానిటైజర్స్,మాస్క్ లు ఇతర పారిశుద్య వస్తువులపై పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. డిజిటల్ సోషలైజేషన్ మాత్రమే ప్రస్తుత సమయంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గమని కూడా మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన,ఇటు ప్రభుత్వం, ప్రజలు అంతా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి బైటపడలేమన్నారు. "ఇప్పటిదాకా ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 3,75,673మందికి సోకింది. 16,642మంది చనిపోయారు. ఇటలీలో 6,007మంది, చైనాలో 3,277మంది, స్పెయిన్ లో 2,311మంది, ఇరాన్ లో 1,812మంది యుఎస్ ఏలో 553మంది చనిపోయారు. ఇండియాలో కూడా దాదాపు 500మందికి సోకింది, 10మంది చనిపోయారు. చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికి 196దేశాలకు విస్తరించింది. మొదటి 67రోజుల్లో లక్షమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 11రోజుల్లోనే 2లక్షల మందికి వచ్చింది. అంటే ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుసుకోవాలి. తొలుత ఒకరిద్దరికి వచ్చిన కరోనా 11రోజుల్లో 2లక్షల మందికి వచ్చింది, ఇప్పుడు 3లక్షల 75వేల మందికి పాకింది. మొదటి దశలో విదేశాలనుంచి వచ్చినవాళ్లనుంచి సోకుతుంది. రెండవ దశలో వారినుంచి స్థానికులకు వ్యాపిస్తుంది. స్టేజి 3లో అంటువ్యాధిగా ఈ మహమ్మారి విజృంభిస్తుంది. 4వ దశకు వస్తే దీనిని ఆపడం అసాధ్యం," అని నాయుడు వివరించారు.
దీని నిరోధానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనీ, విదేశాలనుంచి వచ్చిన వారందరికీ క్వారంటైన్ చేయాలనీ, 14రోజులు పకడ్బందీగా క్వారంటైన్ లో ఉండి నెగటివ్ వస్తేనే వాళ్లను బైటకు పంపాలనీ నాయుడు సూచించారు. కానీ ఇక్కడ మనదగ్గర క్వారంటైన్ పెట్టలేక పోయారు. దీనివల్ల కొంత విస్తరించే ప్రమాదం ఏర్పడింది. ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తే చాలదు, దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు నెలకొల్పాల్సి ఉందన్నారు. ప్రధాని పిలుపు జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సంఘీభావంగా నిలిచారు. రైల్వే సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు రద్దు చేశారు. అంతర్ జిల్లా రాకపోకలను కూడా మహారాష్ట్ర రద్దు చేసింది. దేశీయ విమాన సర్వీసులు ఈ అర్ధరాత్రి నుంచి ఆపేస్తున్నారని కూడా నాయుడు చెప్పారు. " ఈ పరిస్థితుల్లో మార్గం ఒక్కటే...అందరూ సామాజిక దూరం విధిగా పాటించాలి. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా సమాచార మార్పిడి జరగాలి, ఉద్యోగులు తమ విధులను డిజిటల్ సోషలైజేషన్ ద్వారా నిర్వర్తించాలి. సెల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ముఖాముఖి చర్చించుకుని, విధులు నిర్వర్తించాలి. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార మార్పిడి జరగాలి. డిజిటల్ సోషలైజేషన్ మాత్రమే ప్రస్తుత సమయంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గం. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా డిజిటల్ వర్క్ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, అందరిలో అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగకరం. ఇళ్లలోనుంచే కార్యాలయ విధులు నిర్వర్తించే పరిస్థితి కల్పించాలి. డిజిటల్ వర్కింగ్ ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి," అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.
ఒక్కరోజులే మన ఎకానమి 4వేల పాయింట్లు పడిపోయింది. అసంఘటిత రంగంలో కార్మికులు పెద్దఎత్తున ఉపాధి కోల్పోయారు. అనేకరాష్ట్రాలలో 144సెక్షన్ విధించారు. ఇంటికొకరే బైటకెళ్ళి టూ వీలర్ పై ఒకరు, కార్లలో ఇద్దరే బైటకు వెళ్లి అత్యవసర విధులు నిర్వర్తించాలని ఆంక్షలు వచ్చాయి. ప్రపంచంలో 20% ఇళ్లవద్దే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్రమోది ప్రకటించిన లాక్ డౌన్ కంపల్సరీగా అందరూ ఆమోదించాలి, ఆచరించాలి. అప్పుడే ఈ భయంకరమైన వైరస్ ను నిరోధించ గల్గుతాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పాటించకపోవడం కరెక్ట్ కాదు, అందరూ దీనిని ఆచరిస్తేనే కరోనా మహమ్మారిని పారదోలగలం. ఇండియా ఏవిధంగా దీనిని నిరోధిస్తుందో చూడాలని, ఇండియా దీనిని కట్టడి చేయగలిగితే ప్రపంచానికి కూడా కొంత ఊరట వస్తుందని, ఈ వ్యాధిని నియంత్రించగలరని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య కూడా ఎదురు చూస్తోందని నాయుడు చెప్పుకొచ్చారు.
కరవు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. కోళ్ల పరిశ్రమ, ఆక్వా పూర్తిగా దెబ్బతింది. హార్టీకల్చర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే చురుగ్గా వ్యవహరించాలి. ఆన్ లైన్ వినియోగం ద్వారా రైతులను ఆదుకునే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిచోటా పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే చొరవ చూపాలి. పిడిఎస్ ద్వారా ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలన్నారు నాయుడు.
వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాటించాలి. అందుబాటులో ఉన్న శానిటైజర్లు, సబ్బుల ద్వారా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. టచ్ పాయింట్స్ పూర్తిగా తగ్గించుకోవాలి. తలుపులు తీసినప్పుడు, వేసినప్పుడు, లిప్ట్ పాయింట్స్, డోర్ బెల్స్ తదితరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్స్,మాస్క్ లు ఇతర పారిశుద్య వస్తువులపై పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి. కరెన్సీ నోట్లు, నాణేల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. ఆన్ లైన్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాలు,వార్డులలో పరిశుభ్రత పాటించాలి. ఆయా శాఖలు శరవేగంగా స్పందించి పారిశుద్య చర్యలు చేపట్టాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కూడా నాయుడు సూచించారు.