English | Telugu
ప్రజల బాధలు పట్టించుకోకుండా.. స్వప్రయోజనాల కోసం వెంపర్లాట
Updated : Apr 13, 2020
-తెదేపా నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తుంటే ప్రజల బాధలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని తన నివాసం నుండి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రమేష్ కుమార్ కాపాడితే ఆయనను పదవి నుంచి తొలగించడం దుర్మార్గ చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని అప్రజాస్వామికంగా తొలగించడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.
ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, రాజకీయ లాభాలే తనకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎపిలో క్వారంటైన్ ను ఒక ఫార్స్ గా మార్చారని, తమకు నచ్చిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని విమర్శించారు. కనగరాజ్ చెన్నై నుంచి రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు సామాన్య ప్రజలకు, వలస కార్మికులకు రాష్ట్రాల సరిహద్దులు దాటడానికి ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసిని తొలగించడం, మాస్కులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం, నిధులు అడిగిన మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయడం, ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు(పిపిఈలు) ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు. మీతో పాటు ఐదుగురికి భోజనం పెట్టాలని ప్రధాని నరేంద్రమోడి ప్రజలందరికీ పిలుపిస్తే, మన రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టే కేంటిన్లు మూసేసిన చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఆయన వ్యాఖ్యానించారు.
పనులు కోల్పోయిన పేదలకు కుటుంబానికి రూ 5వేలు ఇవ్వాలని రాష్ట్రంలో వైసిపి మినహా అన్ని పార్టీలు కోరినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని, అన్నా కేంటిన్లు తెరవాలని, చంద్రన్న బీమా పునరుద్దరించాలని 12గంటలు దీక్ష చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గద్దె అనురాధలను చంద్రబాబు అభినందించారు.
రాజధాని రైతులు, మహిళలపై అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా నందిగామలో దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి జిల్లాలో పేదలకు, రైతులకు, కార్మికులకు సంఘీభావంగా టిడిపి నాయకులు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతం గుంటూరు-కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ లోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా ఆయన ఆరోపించారు.
కరోనా మరణాలను దాచిపెట్టడం వల్ల మరింత కీడు వాటిల్లుతోందని ఆయన విమర్శించారు. కరోనా మరణం దాచిపెడితే వాటిల్లే దుష్ఫలితాలకు విజయవాడ ఉదంతమే రుజువు అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప, మండల ప్రాతిపదికన తక్కువగా చూపించడం దురుద్దేశ పూర్వకంగా పేర్కొన్నారు. ఏపిలో కరోనా కేసులపై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. చెప్పారు. లాక్ డౌన్ లో కూడా అనేక జిల్లాలలో వైసిపి నేతలు అక్రమ మైనింగ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలలో వందల ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకున్న వారు లేరని విమర్శించారు. గ్రావెల్ అక్రమ తరలింపు ట్రాక్టర్లను సీజ్ చేయకుండా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే ట్రాక్టర్లను సీజ్ చేయడం హేయమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పారిశుద్యం యుద్దప్రాతిపదికన మెరుగుపర్చాలని, జనావాసాల మధ్య మురుగు, చెత్తకుప్పలు తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్య కార్మికులకు ప్రోత్సాహకాలతో పాటు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ ఇవ్వాలని సూచించారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని చెప్పారు. గత 10రోజుల్లోనే పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, దళారులు, అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. రెండు, మూడెకరాల భూమి ఉందనే నెపంతో తెల్లకార్డుదారులకు రూ 1,000 ఆర్ధిక సాయం, రేషన్ సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం శోచనీయమని అన్నారు. 140లక్షల కార్డుదారులకు రూ. 1000 ఇవ్వాల్సివుండగా 123లక్షల కార్డుదారులకు మాత్రమే ఇవ్వడం శోచనీయమన్నారు. ఇటీవల తొలగించిన 18లక్షల రేషన్ కార్డుదారులకు కూడా రూ 1,000 ఆర్ధికసాయం, రేషన్ సరుకులు అందజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ముస్లింలపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. నారాయణ స్వామిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎంగిలి ప్లేట్లు, స్పూన్లు ముస్లింలు నాకడం వల్లే కరోనా వ్యాపిస్తోందని’’ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి వ్యాఖ్యానించడం గర్హనీయమని అన్నారు. ‘ఢిల్లీ జమాత్ వల్లే ఏపిలో కరోనా వ్యాపించిందని’’ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదికి ఫిర్యాదు చేశారని, ‘‘ముస్లింలు ప్లేట్లు, స్పూన్లు నాకడం వల్లే కరోనా వస్తోందని’’ డిప్యూటి సీఎం అన్నారని, ముస్లింల పట్ల వైసిపి నేతల దుర్మార్గ వైఖరికి ఈ వ్యాఖ్యలే రుజువని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని ఏదో ఒక మతానికి అంటగట్టాలని చూడటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ముస్లింలపై వైసిపి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.
ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతిని ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చిత్రపటాలకు ఇళ్లలోనే దండలేసి నివాళులు అర్పించాలని చెప్పారు. వైసిపి ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలను గర్హించాలని, గత ఏడాదిగా దళితులపై దాడులు పెచ్చుమీరడం, అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడం, దళిత డాక్టర్ ను సస్పెండ్ చేయడం, ఎస్సీ నిధులు దారిమళ్లించి స్వాహా చేయడం, తదితర దళిత వ్యతిరేక చర్యలను నిరసించాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పీరియడ్ లో పేద కుటుంబాలకు అండగా ఉంటూ బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులను అభినందించారు. విపత్తులలో బాధితులను ఆదుకోవడం మానవ ధర్మంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విపత్తు బాధితులను ఆదుకోవడానికి టిడిపి చేసిన కృషిని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న చార్ థామ్ యాత్రీకులను, కృష్ణా వరద బీభత్సంలో కర్నూలు, మహబూబ్ నగర్ తదితర 5 జిల్లాల బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడాన్ని ప్రస్తావించారు. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటిస్తూ, స్థానిక అధికారుల సహకారంతో పంపిణీ జరిగేలా చూడాలని కోరారు.
‘‘గత 10రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా వైరస్ 182% పెరిగింది. కర్నూలులో 8300% పెరగ్గా, అనంతపురం 650%, గుంటూరులో 310%, నెల్లూరులో 116%, ప్రకాశంలో 141%, చిత్తూరులో 133%, తూర్పుగోదావరిలో 89%, విశాఖలో 82%, కడపలో 72% పెరగడం ఆందోళనకరం. దేశంలోని వివిధ రాష్ట్రాలలో చూస్తే, గత 10రోజుల్లో మహారాష్ట్రలో 382%, ఢిల్లీ 301%, తమిళనాడు 228%, రాజస్థాన్ 516%, గుజరాత్ 486%, మధ్యప్రదేశ్ 425% పెరిగింది. కేరళ, కర్ణాటక మాత్రమే 100% కన్నా తక్కువ నమోదు అయ్యాయి. కేరళలో ప్రతి మిలియన్ మందికి 428పరీక్షలు చేయగా, ఢిల్లీలో 582పరీక్షలు, మహారాష్ట్రలో 360మందికి, రాజస్తాన్ లో 413మందికి టెస్టింగ్ లు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతి 10లక్షల మందికి కేవలం 161పరీక్షలే చేస్తున్నారని’’ నిపుణుల వ్యాఖ్యలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఎంత ఎక్కువగా టెస్ట్ లు చేస్తే అంతగా కరోనా వైరస్ ను కట్టడి చేయగలం అనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన అంశంగా పేర్కొన్నారు. టెస్టింగ్ లు అధికంగా చేసి, పాజిటివ్ కేసులను ఐసొలేషన్ చేసి, వారికి ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా, వారి ప్రాణాలను కాపాడటమే కాకుండా, వాళ్ల కుటుంబాలను, తద్వారా సమాజంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు అన్నారు.